జాతీయ జట్టుకు అడుగు దూరంలో..!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Surya vanshi) సీనియర్ భారత జట్టు (Senior Indian Cricket Team) లోకి అడుగుపెట్టడానికి మరింత దగ్గరయ్యాడు. జూన్ 2026 లో శ్రీలంక వేదికగా జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ప్రకటించిన 15 మంది సభ్యుల ‘భారత్-ఎ’ (India A) జట్టులో వైభవ్‌కు చోటు లభించింది. ఈ ట్రై-సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్టు తలపడనున్నాయి. యువ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రియాన్ పరాగ్(Riyan Parag) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు వహించనున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీని, ఆయన అద్భుతమైన ఫామ్‌కు గానూ సెలెక్టర్లు ఈ ప్రమోషన్ ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున ఆడుతున్న ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో కేవలం 11 మ్యాచుల్లోనే 236.56 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 440 పరుగులు రాణించారు. ఇందులో ఒక శతకంతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కేవలం 13 ఏళ్ల వయస్సులోనే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లో 175 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో భారత్ కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025 లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మెన్స్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచూరియన్‌గా నిలిచారు. ఇదే 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(SRH) 37 బంతుల్లో 103 పరుగులు చేసి మరోసారి ఈ ఘనతను పునరావృతం చేశారు.
భారత్-ఎ జట్టు జూన్ 9 నుండి జూన్ 21 వరకు శ్రీలంకలో ఈ వైట్-బాల్ (వన్డే) టోర్నమెంట్లో ఆడనుంది. ఈ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లన్నీ దంబుల్లా (Dambulla) వేదికగా జరగనున్నాయి. దీని తర్వాత గాలే (Galle) లో శ్రీలంక-ఎ జట్టుతో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు కూడా జరగనుండగా, ఆ జట్టును తర్వాత ప్రకటిస్తారు. ఈ టూర్లో గనుక వైభవ్ రాణిస్తే, త్వరలోనే ఆయనకు సీనియర్ టీమిండియా క్యాప్ రావడం ఖాయమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.






