ఏపీ సహా 16 రాష్ట్రాల్లో మూడో దశ ఎస్ఐఆర్ స్టార్ట్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం(CEC) మూడో దశ స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కొత్త ఓటర్ల నమోదు, ఓట్ల బదిలీ, తప్పుల సవరణలతో పాటు బోగస్ ఓట్ల తొలగింపు కోసం ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం స్పష్టమైన టైమ్‌లైన్‌ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియ జూన్ మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. జూన్ 5 నుంచి 14 వరకు ఈ ప్రక్రియపై ఎన్నికల అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLO) ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేస్తారు. అన్ని రకాల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
మరోవైపు తెలంగాణలో(Telangana) ఈ ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొద్ది రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు అధికారులకు శిక్షణ ఇవ్వనుండగా, జులై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని మార్పులు చేర్పులు పూర్తి చేసి అక్టోబర్ 1న తెలంగాణ తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వాడుకుని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






