గుంటూరులో “పెమ్మసాని మార్క్” ప్రగతి..!
గుంటూరు నగర అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా మరో అడుగు పడింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పట్టాభిపురం రైతు బజార్ నూతన హైటెక్ భవన నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrashekhar), గుంటూరు(Guntur) పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిలతో(Galla Madhavi) కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఈ మార్కెట్‌ను కార్పొరేట్ స్థాయి వసతులతో ఆధునీకరించేందుకు ఈ మెగా ప్రాజెక్టును చేపట్టారు.
ఇవి కూడా చదవండి
వినియోగదారులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు రూ. 6 కోట్ల భారీ వ్యయంతో, సుమారు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన రైతు బజార్‌ను నిర్మించనున్నారు. అత్యంత ఆధునిక సాంకేతికతతో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తుల భవనంగా ఇది రూపుదిద్దుకోనుంది. ఎండ, వానల నుండి రక్షణ కల్పిస్తూ పూర్తి హైజీనిక్ వాతావరణంలో కూరగాయలు కొనుగోలు చేసేలా ఈ ప్లాన్ డిజైన్ చేశారు. ఈ నూతన మల్టీ-లెవెల్ భవనంలో మొత్తం 100 అత్యాధునిక షాపులను ఏర్పాటు చేస్తున్నారు.
సామాజిక, ఆర్థిక సమతుల్యతను పాటిస్తూ ఈ షాపుల కేటాయింపులో స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. 60 షాపులను, నేరుగా గ్రామాల నుండి వచ్చే అసలైన రైతులకు కేటాయిస్తారు. 30 షాపులను స్వయం సహాయక బృందాలకు చెందిన డ్వాక్రా (DWCRA) మహిళా వ్యాపారులకు కేటాయిస్తారు. మిగిలిన షాపులను ఇతర నిత్యావసర వస్తువుల విక్రయదారులకు కేటాయించనున్నారు. కేవలం షాపులే కాకుండా, కస్టమర్ల సౌకర్యార్థం ఈ భవనంలో అధునిక పార్కింగ్ సౌకర్యం, స్వచ్ఛమైన తాగునీరు, అత్యాధునిక టాయిలెట్స్ మరియు హైజీన్ వసతులను కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ భవన నిర్మాణం ఇన్నాళ్లూ జాప్యం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రైతులకు, వినియోగదారులకు ఒకే చోట మేలు చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేవలం 9 నెలల రికార్డు కాలంలోనే ఈ భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి






