మహానాడు రెండురోజులేనా..? బహిరంగ సభ రద్దు..?
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే “మహానాడు”(Mahanadu) ఉత్సవాల నిర్వహణపై పార్టీ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. సాధారణంగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని, ఈసారి రెండు రోజులకు కుదించాలని నేతలు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 27 మరియు 28వ తేదీలలో మాత్రమే ప్రతినిధుల సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, పొదుపు మంత్రం గురించి హెచ్చరించిన నేపధ్యంలో.. టీడీపీ(TDP) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు రోజుల ప్రతినిధుల సభలోనే రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ, ఆర్థిక అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ ముగింపు ప్రసంగంతోనే ఈ ఏడాది మహానాడును ముగించాలని పార్టీ సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం. స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జన్మదినమైన మే 28వ తేదీనే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించేలా పార్టీ అంతర్గత సమాలోచనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, మొదట అనుకున్నట్లుగా ఈ నెల 29వ తేదీన నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభను రద్దు చేయాలని పార్టీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరమైన బిజీ షెడ్యూల్స్ మరియు ఇతర ప్రాధాన్యతల వల్లే ఈ బహిరంగ సభను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మహానాడును రెండు రోజులకు కుదించడం మరియు 29న బహిరంగ సభను రద్దు చేయడంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ముద్ర పడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనంతపురం పర్యటనను ముగించుకుని అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత, పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మార్పులపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.






