వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్, నెట్స్‌లో 10 ఏళ్ల బాలుడిపై తండ్రి ఒత్తిడి..!
ఐపీఎల్లో(IPL) వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న రికార్డుల నేపథ్యంలో, నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ నెట్స్ ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో, ఒక తండ్రి తన 10 ఏళ్ల చిన్నారిని బలవంతంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ల (Pacers) బౌలింగ్‌ను ఎదుర్కోవాలని నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంత వేగంగా వస్తున్న బంతులను ఆడటానికి ఆ చిన్న పిల్లాడు భయపడుతూ, ససేమిరా అంటున్నా సరే.. తండ్రి మాత్రం అస్సలు వెనక్కి తగ్గకుండా క్రీజులోకి పంపుతున్నాడు.
నెటిజన్లు ఈ వీడియోను “వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్” (Vaibhav Sooryavanshi) గా అభివర్ణిస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ టీమ్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికై సత్తా చాటుతుండటాన్ని చూసి, సదరు తండ్రి కూడా తన కొడుకును అంతటి వాడిని చేయాలనే భ్రమలో పడ్డాడని విమర్శిస్తున్నారు. ప్రతి చిన్నారికి వైభవ్‌లాంటి అసాధారణ ప్రతిభ ఉండదని, వయసుకు మించిన భారాన్ని పిల్లలపై రుద్దడం వల్ల వారికి క్రికెట్‌పైనే అసహ్యం కలుగుతుందని క్రీడా ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
వేగంగా దూసుకొచ్చే బంతులను చిన్న పిల్లలు తట్టుకోలేరని, హెల్మెట్ ఉన్నప్పటికీ తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఇష్టాయిష్టాలను, వారి శారీరక సామర్థ్యాన్ని గమనించకుండా, కేవలం టీవీల్లో చూసే సెలబ్రిటీల లాగా మార్చాలని కన్నవారే ఇలా కఠినంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు సదరు తండ్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని క్రీడా ప్రేమికులు కోరుతున్నారు.






