జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు అటు రాష్ట్రంలోనూ, ఇటు దేశ రాజధానిలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తన రాజకీయ ప్రస్థానం, గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం, తన గురువు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతానన్న ఆయన ప్రకటన, రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రణాళికను స్పష్టం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి తన రాజకీయ విధేయతను చాటుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే తమ లక్ష్యమని కుండబద్దలు కొట్టారు. గాంధీ కుటుంబంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం సామాన్యమైనది కాదని ఆయన మాటల్లో అర్థమవుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా రాహుల్ గాంధీ నేరుగా రేవంత్‌కే ఫోన్ చేస్తారంటే, కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఏపాటిదో ఊహించవచ్చు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఆయన ఇప్పుడే రిజర్వ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు శాశ్వతం కాదన్న సూత్రం ఉన్నప్పటికీ, తన గురువు చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డి గౌరవం వ్యక్తం చేశారు. చంద్రబాబు దగ్గర తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. టీడీపీ వీడే సమయంలో దాగుడుమూతలు ఆడకుండా నేరుగా వెళ్లి ఆశీస్సులు తీసుకోవడం ఆయన నైతికతను చాటి చెబుతోంది. ఒక నాయకుడిని నమ్మితే చివరి వరకు అండగా ఉంటాననే ఆయన మాటలు, తన కేడర్‌కు, మిత్రపక్షాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపాయి.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ZPTCగా కెరీర్ ప్రారంభించి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎన్నికలయ్యారు. 2014లో ఎంపీగా ఓడినా 2019లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పిన రేవంత్ రెడ్డి, అన్నట్టుగానే సీఎం అయ్యారు. దీన్నిబట్టి తన టార్గెట్స్ ను రేవంత్ రెడ్డి ఎంత పక్కాగా నిర్దేశించుకుంటారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన కన్ను 2034 మీద పడింది. రాబోయే పదేళ్ల పాటు అంటే 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజాసేవలోనే ఉంటానని, మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ఆయన ప్రకటించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ముచ్చట్లు మాత్రమే కావు. ఇవి ఆయన భవిష్యత్ వ్యూహాలను తెలియజేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడం, 2034 వరకు తిరుగులేని శక్తిగా ఎదగడం, ఆపై జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఆయన అంతిమ లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే ఆకాంక్షతో పాటు, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో తెలంగాణ గొంతుకగా మారాలనే సంకల్పం రేవంత్ మాటల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ పదేళ్ల ప్రయాణం తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.






