జిన్ పింగ్ నోటి వెంట థుసిడైడ్స్ ట్రాప్ మాట..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు.. చైనా అధినేత షి జిన్ పింగ్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. థుసిడైడ్స్ ట్రాప్ (Thucydides Trap)ను అమెరికా అధిగమించాలని సూచించారు.ఇంతకూ ఈ థుసిడైడ్స్ ట్రాప్ అంటే ఏంటి..?
థుసిడైడ్స్ ట్రాప్.. ఒక ఎదుగుతున్న దేశం, ఇప్పటికే అగ్రరాజ్యంగా కొసాగుతున్న దేశాన్ని సవాలు చేసినప్పుడు రెండింటి మధ్య పలు విషయాల్లో తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొంటాయి. ఒక్కోసారి యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. గతంలో యుద్ధాలు జరిగిన సందర్భాలూ అనేకం. దీనినే థుసిడైడ్స్ ట్రాప్‌గా చెప్తారు.
480 బీసీలో ఈ పదానికి బీజం పడింది. నాడు గ్రీకులు రెండవ పర్షియన్ దండయాత్రను విజయవంతంగా తిప్పికొట్టారు. ఆ తర్వాత ప్రాచీన గ్రీక్ ప్రపంచంలో ఏథెన్స్, స్పార్టా రాజ్యాలు ఆధిపత్య శక్తులుగా ఆవిర్భవించాయి. అజియన్ సీ అంతటా ఏథెన్స్ తన ప్రభావాన్ని విస్తరించుకుంది. అప్పటికే సుప్రీంలీడర్‌గా ఉన్న స్పార్టా రాజ్యంలో ఇదంతా తీవ్ర అశాంతిని సృష్టించింది.
ఏథెన్స్ ఎదుగుదల, స్పార్టాలో కలిగిన ఆందోళన యుద్ధాన్ని అనివార్యం చేశాయని గ్రీక్ చరిత్రకారుడు థుసిడైడ్స్ అభివర్ణించారు. గ్రీస్ ప్రధాన భూభాగంపై ఆధిపత్యం కోసం రెండూ ఘర్షణకు దిగాయి. ఇదే పెలొపొనేషియన్ యుద్ధం. 27 ఏళ్ల పాటు జరిగిన యుద్ధం వల్ల రెండు శక్తులు బలహీనపడ్డాయి. అదే గ్రీస్ స్వర్ణయుగానికి ముగింపు పలికింది. థుసిడైడ్స్ ఈ వార్‌కు అక్షరరూపం ఇచ్చారు. ఆయన పేరు మీదుగానే థుసిడైడ్స్ ట్రాప్ (Thucydides Trap) అనే పదం వచ్చింది. దానిని 2012లో అమెరికా రాజకీయ విశ్లేషకుడు గ్రాహమ్ అలిసన్ పాపులర్ చేశారు. తర్వాత ‘Destined for War’ పుస్తకంలో ఈ పదానికి మరింత వివరణ ఇచ్చారు. హార్వర్డ్ బెల్ఫర్ సెంటర్లో జరిపిన పరిశోధనలో భాగంగా 500 ఏళ్ల కాలంలో ఇలాంటి 16 ఉదాహరణలను గుర్తించారు. 12 కేసుల్లో యుద్ధాలు జరిగాయి.
ఎదుగుతున్న శక్తి, అప్పటికే సుప్రీంలీడర్‌గా ఉన్న దేశం మధ్య యుద్ధం అనివార్యమని చెప్పడం థుసిడైడ్స్ ట్రాప్ (Thucydides Trap) ఉద్దేశం కాదు. ఎదుగుతున్న దేశం ఆకాంక్షలు, ఇప్పటికే అంతర్జాతీయ క్రమానికి కొత్తరూపం ఇవ్వాలన్న కోరిక.. అగ్రరాజ్యంగా ఉన్న దేశంలో భయం, ఆందోళన, తన పట్టును నిలుపుకోవాలనే ప్రయత్నానికి దారితీస్తాయి. ఈ అధికారిక మార్పు పలు ఒత్తిళ్లకు దారితీస్తుందని హెచ్చరించడమే ఇక్కడ అసలు లక్ష్యం.
ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యంగా ఉండగా.. చైనా (China) అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకుంటూ వస్తోంది. అప్పటి స్పార్టా-ఏథెన్స్ను ఇప్పటి అమెరికా-చైనా (USA-China) తో రాజకీయ విశ్లేషకులు పోల్చుతున్నారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక శక్తిగా ఉన్న అమెరికాను కొన్నేళ్లుగా చైనా సవాలు చేస్తోంది. డ్రాగన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటోంది. బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అంతర్జాతీయంగా పట్టును ప్రదర్శిస్తోంది. కృత్రిమ మేధ, సెమీకండక్టర్స్, వాణిజ్యం ఇలా పలు రంగాల్లో అగ్రరాజ్యానికి పోటీదారుగా ఉంది. ఇదే అమెరికాను భయపెడుతోంది.
చైనాను కట్టడి చేసేందుకు టారిఫ్ వేయడం, సాంకేతిక అంశాల్లో ఆంక్షలను కఠినతరం చేయడం, ఆసియాలో మిలిటరీ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. చైనా తన శక్తికి తగిన ప్రభావాన్ని, గుర్తింపును కోరుకుంటుండగా.. తన చిరకాల ఆధిపత్యాన్ని కోల్పోతానేమోనని అమెరికా భయపడుతోంది. ఇవన్నీ గమనించే ట్రంప్‌నకు జిన్‌పింగ్ హెచ్చరిక లాంటి సలహా ఇచ్చారు. బీజింగ్‌ను శత్రువుగా చూడకుండా తనతో సమాన శక్తిగా గుర్తించి సంప్రదింపులు జరపాలన్నదే జిన్‌పింగ్ ఆలోచనగా కనిపిస్తోంది.






