చైనా పవర్ సెంటర్ జోంగ్నాన్హై.. ప్రత్యేకత ఏంటి..?
చైనా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘జోంగ్నాన్హై (Zhongnanhai)’లో పర్యటించడంతో ఈ ప్రదేశం మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జోంగ్నాన్ హై విషయానికొస్తే… ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, శక్తిమంతమైన రాజకీయ కాంపౌండ్లలో ఇది ఒకటి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నివాసం ఉండే ఈ ప్రాంగణంలో విదేశీ నేతలకు ఆతిథ్యమివ్వడం అత్యంత అరుదు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ (Donald Trump)ను ఇక్కడికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.
ఈ గోడల వెనకే కీలక నిర్ణయాలు..
బీజింగ్‌లో ఉండే ‘జోంగ్నాన్హై’ కాంపౌండ్.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, కౌన్సిల్‌కు హెడ్‌క్వార్టర్. 1950 నుంచి అధికార కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఇక్కడే నివాసం ఉంటూ పాలన సాగిస్తున్నారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఇందులోనే ఉంటారు. వైట్‌హౌస్ మాదిరిగా ఈ ప్రాంగణంలోకి వెళ్లేందుకు సాధారణ పౌరులకు అనుమతి ఉండదు. చైనా ప్రభుత్వ పాలసీ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలను ఇక్కడే రూపొందిస్తారు. సంబంధిత నేతలు ఆ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ కాంపౌండ్ దాటి అవి బయటకు వెళ్లవు అనే పేరుంది. ఈ ప్రాంగణంలో లగ్జరీ నివాసాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయి.
చైనా పాలకులు ఈ ప్రాంగణంలో విదేశీ నేతలకు ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో వంటి నేతలతో షీ జిన్‌పింగ్ ఇక్కడ భేటీ అయ్యారు. 2014లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఈ కాంపౌండ్‌లోని ఓ ద్వీపంలో జిన్‌పింగ్ (Xi Jingping)తో కలిసి వాక్ చేసినట్లు అప్పట్లో చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 2002లో నాటి అగ్రరాజ్య అధ్యక్షుడు జార్జ్ బుష్ కూడా ఈ కాంపౌండ్‌ను సందర్శించారు. 2017లో ట్రంప్ చైనాలో పర్యటించినప్పటికీ.. నాడు ఈ ప్రాంగణానికి ఆయనను ఆహ్వానించలేదు. తాజాగా ఇప్పుడు జిన్‌పింగ్ తన పవర్ సెంటర్లో అమెరికా అధ్యక్షుడికి ఆతిథ్యమివ్వడం ఇరు దేశాధినేతల వ్యక్తిగత మైత్రిని చాటిచెబుతోంది.
గార్డెన్ నుంచి పవర్ సెంటర్‌గా..
‘జోంగ్నాన్హై’ అంటే.. మధ్య, దక్షిణ సముద్రాలను కలిపే వారధి అని అర్థం. ఈ కాంపౌండ్‌లోని సరస్సులు ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉండటంతో దీనికీ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. రాజుల కాలంలో ఇది ఉద్యానవనంగా ఉండేది. 12వ శతాబ్దానికి చెందిన సరస్సులు కూడా ఇక్కడ ఉన్నాయట. చైనా రాచరిక చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్వింగ్, మింగ్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు ఇక్కడ నివాసం ఉండేవారని చరిత్ర చెబుతోంది.
1898లో క్వింగ్ రాజవంశానికి వ్యతిరేకంగా ఇక్కడ తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో మహారాణి డోవేగర్ సిక్స్.. తన మేనల్లుడిని ఈ గార్డెన్‌లోని కృత్రిమ ద్వీపంలో బంధించారట. దీని చరిత్ర, ప్రాముఖ్యతను గుర్తించిన కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్.. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటుచేసిన తర్వాత.. ‘జోంగ్నాన్హై’ను తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చైనా పాలకవర్గంలో ఉన్న నేతలకు ఇది అధికారిక రాజకీయ కేంద్రంగా కొనసాగుతూ వస్తోంది. 1972లో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ను మావో తన నివాసానికి ఆహ్వానించారు. ఆ పర్యటనతోనే కొన్ని దశాబ్దాల పాటు ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన తొలగి సత్సంబంధాలు ఏర్పడ్డాయి.






