పొగాకు మానేశారా? అయినా ముప్పు తప్పదంటున్న నిపుణులు
Oral Cancer: పొగాకు అలవాటును మానుకున్నాం కదా అని నిశ్చింతగా ఉండటం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో చాలా ఏళ్ల పాటు పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, గుట్కా, ఖైనీ) వాడి, ఇప్పుడు మానేసినప్పటికీ.. ఆ పాత అలవాటు వల్ల నోటి, ఊపిరితిత్తుల, పొట్ట క్యాన్సర్ వచ్చే ముప్పు ఇంకా పొంచి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన కలిగించే విషయం..
ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి అయిన ఎంఎన్జే (MNJ) లో ఏటా సుమారు 2,500 మంది నోటి క్యాన్సర్ బాధితులు, 700 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, మరో 350 మంది పొట్ట క్యాన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది 2-3 ఏళ్ల క్రితమే అలవాటు మానేసిన వారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 20 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు, శ్రామిక వర్గాల వారు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
నోటిలో మార్పులను గమనిస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- రెండు వారాలకు మించి నోటిలో, నాలుకపై మానని పుండ్లు ఉండటం.
- తెల్లని లేదా ఎర్రని మచ్చలు ఏర్పడటం.
- నోటిలో లేదా మెడలో గడ్డలు, కారణం లేకుండా నొప్పి రావడం.
- గొంతు బొంగురు పోవడం, బరువు తగ్గడం.
వ్యాధి నివారణ మార్గాలు..
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొలి దశలో గుర్తిస్తే 90 శాతం మందికి క్యాన్సర్ నయం చేయవచ్చు. గుట్కా, పొగాకు మానేయడం వల్ల 80 శాతం రిస్క్ తగ్గుతుంది. ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని ఆయన సూచించారు.






