సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న కిడ్నీ స్టోన్స్.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కిడ్నీలు సేఫ్!
Health: కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న తీవ్రమైన సమస్య. శరీరంలోని ద్రవ పదార్థాలు తగ్గినప్పుడు ఖనిజాలు, లవణాలు ఒకచోట చేరి స్పటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడతాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల నుంచి పెద్ద పరిమాణం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పెరగకముందే కిడ్నీల ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే ముప్పును నివారించవచ్చు.
కిడ్నీల ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలు..
తగినంత నీరు తాగడం..
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం తక్కువగా నీరు తాగడం. తగినంత నీరు అందకపోతే మూత్రం గాఢత పెరిగి రాళ్లు త్వరగా ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం వల్ల వ్యర్థాలు బయటకు ఎప్పటికప్పుడు వెళ్లిపోతాయి.
సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం..
ఆహారంలో ఉప్పు,మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల ముప్పు పెరుగుతుంది. సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
సరైన వ్యాయామం..
ఇప్పుడు కేవలం వయసు పైబడిన వారికే కాకుండా, మారిన జీవనశైలి వల్ల యువతలో కూడా కిడ్నీ రాళ్ల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన వ్యాయామం చేయడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ముందస్తు గుర్తింపు..
వెన్ను భాగంలో లేదా పొత్తికడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా మూత్రం రంగు మారడం వంటివి కిడ్నీ రాళ్ల లక్షణాలు. ఇలాంటి సంకేతాలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలి.
చికిత్స తర్వాత జాగ్రత్తలు..
ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారికి భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చికిత్స పూర్తయిన తర్వాత కూడా వైద్యుల సలహా మేరకు కఠినమైన ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.






