కంటి క్యాన్సర్‌కు చెక్.. ఎల్వీ ప్రసాద్, టాటా ట్రస్ట్ సరికొత్త అడుగు!
LVPEI: పుట్టుకతోనే చిన్నారుల్లో వచ్చే కంటి శుక్లాలు , రెటినో బ్లాస్టోమా (కంటి క్యాన్సర్) వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ (LVPEI), టాటా ట్రస్ట్ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ‘రెడ్ రిఫ్లెక్స్ స్క్రీనింగ్’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నాయి.
స్క్రీనింగ్ విధానంపై అవగాహన..
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆర్క్ లైట్ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు డాక్టర్ ఆండ్రూ బ్లెకీ నేతృత్వంలో వారం రోజుల పాటు ‘ట్రైన్ ది ట్రైనర్’ అనే వర్క్‌షాప్ నిర్వహించి స్క్రీనింగ్ విధానంపై అవగాహన కల్పించారు. అవగాహన లోపంతో వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి రావడం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందే గుర్తిస్తే ప్రాణాలను, చూపును కాపాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
స్క్రీనింగ్ విధానం..
- నవజాత శిశువుల కంటిలోకి ఆరోగ్య కార్యకర్తలు ఆర్క్ లైట్ (ARC Light) వేసి పరీక్షిస్తారు.
- కంటిలో తెల్లటి మచ్చ కనిపిస్తే, దానిని శుక్లాలు లేదా కంటి క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలి.
- అనుమానిత లక్షణాలు ఉన్న పిల్లలను కమ్యూనిటీ కోఆర్డినేటర్లు వెంటనే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు.
ఉచిత సేవలు..
స్క్రీనింగ్‌లో సమస్యలు ఉన్నట్లు తేలితే నిపుణుల ద్వారా సర్జరీ లేదా ఆధునిక చికిత్స అందించి నయం చేస్తారు. ఈ సేవలన్నీ చిన్నారులకు ఉచితంగా అందించనున్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఎల్వీపీఈఐ ప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి






