దృష్టి మళ్లించి నిలువునా దోపిడీ.. నగరంలో కొత్త తరహా ముఠాల హల్చల్!
Hyderabad: రాజధాని నగరంలో ‘అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు అమాయక ప్రజలే లక్ష్యంగా రెచ్చిపోతున్నాయి. సాయం చేస్తున్నట్లు నటిస్తూ లేదా ఎదుటివారి దృష్టి మళ్లించి నగదు, నగలు, సెల్ఫోన్లను దోచుకుంటున్నాయి. ఇటీవల ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న నాలుగు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మోసాల తీరు ఇలా..
ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులు, అమాయకులను ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. నగదు విత్డ్రా చేయడంలో సాయం చేస్తామని నమ్మించి, పిన్ నంబర్ తెలుసుకుని, అసలు కార్డుకు బదులు నకిలీ కార్డును అంటగడుతున్నారు. అనంతరం ఖాతాలోని సొమ్మును కాజేస్తున్నారు.అర్ధరాత్రి అత్యవసరంగా నగదు కావాలని, యూపీఐ ద్వారా మీ ఖాతాకు పంపిస్తామని నమ్మించి బాధితుల నుండి నగదు తీసుకుంటున్నారు. నకిలీ మెసేజ్లు చూపిస్తూ నిలువునా ముంచేస్తున్నారు. జేబులో నుంచి డబ్బు కింద పడిపోయిందని చెప్పడం, బైక్ మీద నుంచి పడిపోతున్నట్లు నటించడం వంటి మార్గాల్లో బాధితుల దృష్టి మళ్లించి.. మెడలోని గొలుసులు, సెల్ఫోన్లు లాక్కెళ్తున్నారు.
మహిళా ముఠాల హల్చల్..
బస్సులు, రద్దీ ప్రాంతాల్లో మహిళా ముఠాలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నాయి. బట్టలపై ఏదో అంటుకుందని చెప్పి దృష్టి మళ్లించి హ్యాండ్బ్యాగులు, సెల్ఫోన్లు కొట్టేస్తున్నారు.
పోలీసుల సూచనలు..
నగరంలోని ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అపరిచితులకు నగదు లేదా కార్డులను ఇవ్వవద్దని గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ సూచించారు. బ్యాంకింగ్ లావాదేవీల తర్వాత ఫోన్కు వచ్చే మెసేజ్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.






