“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” కొత్త పోస్టర్ విడుదల
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
కొత్త పోస్టర్లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా ప్రతిబింబిస్తోంది. తన నగరాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్న స్పైడర్-మ్యాన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడని ఈ పోస్టర్ సూచిస్తోంది.
స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్ ఘన విజయానికి నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. ప్రపంచం తనను గుర్తించని పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న పీటర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించడమే తన ధ్యేయంగా మారుతుంది. కానీ కొత్త నేరాల పరంపరతో పాటు అతని జీవితాన్ని కుదిపేసే శక్తివంతమైన శత్రువు రంగంలోకి దిగడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.
సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియా  ఈ చిత్రాన్ని భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనుంది.






