చెత్త కాలిస్తే జేబుకు చిల్లే.. భారీ జరిమానా విధిస్తున్న జీహెచ్ఎంసీ
Air Pollution: నగరంలో బహిరంగంగా చెత్తను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. వీధుల చివరన, ఖాళీ స్థలాల్లో పోగుపడిన చెత్తకు నిప్పు పెట్టడం వల్ల వెలువడే విషవాయువులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర హానికర రసాయనాలు మండటం వల్ల గాలిలో PM 2.5 రేణువుల శాతం సాధారణం కంటే 10 రెట్లు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన అనారోగ్య సమస్యలు:
ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రజలు క్యాన్సర్, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వైద్యుల గణాంకాల ప్రకారం.. ఆస్తమా కేసుల్లో సుమారు 35 శాతం కలుషిత గాలి వల్లే నమోదవుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల వల్ల భూతాపం కూడా పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ జరిమానాలు..
ఇటీవల పటాన్చెరు పారిశ్రామిక వాడలో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన, చెత్తను తగులబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం చెత్తను కాల్చే వారికి కనిష్టంగా రూ. 5,000 నుండి గరిష్టంగా రూ. 25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ప్రజలకు విజ్ఞప్తి ..
నగర వాతావరణాన్ని కాపాడేందుకు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని అధికారులు కోరుతున్నారు. బహిరంగంగా చెత్తను కాల్చడం మానుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






