అమెరికా పతనంలో ఉందన్న జిన్ పింగ్.. ఖండించని ట్రంప్….!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా …షి జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుతం పతనం అంచున ఉందని చైనా (China) అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నారు. ఇది కాస్త ఘాటు వ్యాఖ్యే అయినా .. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీన్ని ఖండించలేదు. పైగా మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అంటూ విమర్శలు చేశారు. తన పరిపాలనలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్టు పెట్టారు.
అధ్యక్షుడు జిన్పింగ్ (Xi Jinping) అమెరికాను క్షీణిస్తున్న దేశంగా అభివర్ణించారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, నిద్రమత్తులో ఉండే జో బైడెన్ (Joe Biden) పరిపాలనను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ విషయంలో చైనా అధ్యక్షుడితో తాను 100% ఏకీభవిస్తానని తెలిపారు. బహిరంగ సరిహద్దులు, అధిక పన్నులు, దారుణమైన వాణిజ్య ఒప్పందాలు, పెరిగిన నేరాలతో సహా అనేక కారణాలతో అమెరికా అపారంగా నష్టపోయిందంటూ బైడెన్ పరిపాలనను విమర్శించారు.
తన 16 నెలల అద్భుతమైన పదవీకాలంలో దేశం అసాధారణమైన పురోగతి సాధించిందని ట్రంప్ వెల్లడించారు. రికార్డ్ స్థాయి స్టాక్మార్కెట్లు, కొత్త పెట్టుబడి నిబద్ధతలు, వెనెజువెలాలో సైనిక విజయం, సైనిక చర్యతో ఇరాన్ను నాశనం చేయడం (ఇది ఇంకా కొనసాగుతోంది) వంటివి ఎన్నో జరిగాయన్నారు. నిజానికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని అద్భుతమైన విజయాలు సాధించినందుకు జిన్పింగ్ తనను అభినందించాలని వ్యాఖ్యానించారు.
ఈసందర్భంగా రెండేళ్ల క్రితం తమ దేశం నిజంగానే పతనం అంచున ఉందని ట్రంప్ తెలిపారు. కానీ, ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని వెల్లడించారు. చైనాతో తమ సంబంధాలు గతంలో కంటే బలంగా, మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.






