చైనాలో ట్రంప్ సీక్రెట్ కమాండ్ పైనా ఆంక్షలు..!
బీజింగ్ పర్యటనలో అగ్రరాజ్యాధినేతకు షాకిచ్చారు చైనా అధికారులు. అమెరికా భద్రతా సిబ్బందిపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామం అమెరికా భద్రతాధికారులకు ఆగ్రహం కలిగించింది. భద్రతా సిబ్బందిపైనే కాదు జర్నలిస్టులపైనా నియంత్రణ విధించారు. దీంతో ఇరుదేశాల భద్రతా సిబ్బంది, జర్నలిస్టుల మధ్య ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి.
సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా వెళ్తే.. ఆయన పర్యటించే ప్రాంతం మొత్తాన్ని అగ్రరాజ్య సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తమ గుప్పిట్లో ఉంచుకుంటారు. ఆ చోట చీమ చిటుక్కుమనాలన్నా తమ అనుమతి ఉండాల్సిందే అన్నరీతిలో అమెరికా భద్రతా సిబ్బంది వ్యవహరిస్తారు. కానీ, చైనా (China)లో మాత్రం వీరి కమాండింగ్ పని చేయలేదు. అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పర్యటన వేళ బీజింగ్ భద్రతా సిబ్బంది వీరికి షాకిచ్చారు.
వైట్‌హౌస్ సిబ్బందిని నెట్టేసి..
ట్రంప్.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jingping)తో ద్వైపాక్షికంగా భేటీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశ వేదిక వద్దకు చైనా మీడియా సిబ్బంది దూసుకొచ్చారు. వైట్‌హౌస్ సిబ్బందిని నెట్టుకుంటూ ప్రాంగణం లోపలికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో అమెరికా సిబ్బందిలో ఒకరు కిందపడటంతో స్వల్ప గాయాలైనట్లు సమాచారం.. దీనిపై అగ్రరాజ్య అధికారులు చైనా వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.
టెంపుల్‌లోకి నో ఎంట్రీ..
ఇక, బీజింగ్‌లోని ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ను ఇరు దేశాధినేతలు సందర్శించారు. ఆ సమయంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన ఓ ఏజెంట్ వద్ద తుపాకీ ఉందన్న కారణంతో చైనీస్ అధికారులు టెంపుల్ లోపలికి అనుమతించలేదు. ఆయుధాన్ని తమకు ఇచ్చిన తర్వాతే లోపలికి వెళ్లాలని సూచించారు. ఇందుకు అమెరికా ప్రతినిధులు అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత మరో సీక్రెట్ సర్వీస్ అధికారిని అనుమతించగా.. గన్‌తో ఉన్న ఆ ఏజెంట్ వెలుపలే ఉండిపోయారు.
జర్నలిస్టులను ఆపి..
ఇక, టెంపుల్ నుంచి ట్రంప్, జిన్‌పింగ్ వెళ్లిపోతుండగా.. ప్రెసిడెన్షియల్ మోటార్‌కేడ్‌లో కలవకుండా అమెరికా జర్నలిస్టులను చైనా అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అగ్రరాజ్య ప్రతినిధులు.. బీజింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే, సెక్యూరిటీ బారియర్లను దాటుకుని వైట్‌హౌస్ సిబ్బంది, జర్నలిస్టులు ట్రంప్ కాన్వాయ్‌ను చేరుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి.
ఇవేగాక.. ఈ పర్యటనలో అమెరికా రిపోర్టర్లకు పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం. వాటర్ బాటిళ్లు ఇవ్వకపోవడం, వాష్‌రూమ్ వినియోగంపై పరిమితి విధించడంతో అగ్రరాజ్య జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారట. మరోవైపు నోపార్కింగ్‌లో ఫాక్స్ న్యూస్‌కు చెందిన ఓ వ్యాన్‌కు జరిమానా పడింది. అయితే, చైనా అధికారులు ఇలా నియంత్రించడం ఇదే తొలిసారి కాదు. 2017లో ట్రంప్ బీజింగ్ పర్యటన సమయంలోనూ యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, చైనా భద్రతా అధికారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు నాడు వార్తలు వచ్చాయి.






