ఆ సమయంలో ఏపీ ఐసీయూలో ఉంది : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నాటికి ఇంటెన్సివ్ కేర్ లో ఉండటం వల్లే తెలుగుదేశం (Telugu Desam), బీజేపీ (BJP)తో కలిసి కూటమి కట్టామని, తమిళనాడు (Tamil Nadu)తో ఇక్కడి రాజకీయ పరిస్థితులు పోల్చి చూడటం సరికాదని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుండబద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో పవన్ పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ పెట్టిన తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం (YCP Government) వస్తే ఇళ్లల్లో ఆడపిల్లల్ని కూడా బయటకు లాగేసే పరిస్థితులు వస్తాయని, ఎవరినీ బతకనివ్వరని 5 కోట్ల ప్రజల సుస్థిరత కోసమే కూటమిగా కలిసి వెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొన్ని విషయాల్లో విభేదిస్తూ ఉండొచ్చని, ఈ రోజుకీ ఆయనతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. కూటమితో నడుస్తున్నా జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని మాత్రం చేయనని ప్రకటించారు. పార్టీని ఇక ఎలా నిర్మించనున్నదీ వెల్లడించారు. ఈ రెండేళ్లలో పాలన విషయాలు నేర్చుకున్నానని, ఇక పార్టీకి సమయం కేటాయిస్తానన్నారు.







