కుమారుడిపై పోక్సో కేసు.. తల్లికి గుండెపోటు.. మానసిక ఒత్తిడిలో బండి కుటుంబం!
తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు కుమారుడి చుట్టూ ముసురుకున్న చట్టపరమైన వివాదాలు, మరోవైపు కన్నతల్లి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలవ్వడం బండి సంజయ్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బండి భగీరథ్ వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు, మానసిక వేదనను అనుభవిస్తున్న బండి సంజయ్ కుటుంబానికి, తాజాగా ఆయన తల్లి బండి శకుంతలమ్మ హఠాత్తుగా గుండెపోటుకు గురికావడం మరింత తీరని శోకాన్ని, బాధను మిగిల్చింది. రాజకీయంగా ఎంతటి ఒడిదొడుకులనైనా తట్టుకునే బండి సంజయ్, ఒకేసారి కుటుంబంలో తలెత్తిన ఈ వరుస సంక్షోభాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
శుక్రవారం కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న శకుంతలమ్మ హఠాత్తుగా ఛాతిలో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రాథమిక లక్షణాలను బట్టి అది గుండెపోటుగా గుర్తించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను గమనించి, కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ఎటువంటి జాప్యం జరగకుండా గ్రీన్ చానల్ తరహాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హుటాహుటిన ఆమెను గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే డాక్టర్ల బృందం ఆమెను అత్యవసర విభాగంలో చేర్చుకుని పరీక్షలు నిర్వహించింది.
మెడికవర్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన పలు క్లినికల్ పరీక్షల్లో శకుంతలమ్మ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో తీవ్రమైన బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కార్డియాలజీ నిపుణులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసరంగా ఆంజియోప్లాస్టీ నిర్వహించి, గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. .
శకుంతలమ్మ హఠాత్తుగా గుండెపోటుకు గురికావడం వెనుక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు, కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా మనవడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారం ఆమెను తీవ్రంగా కలచివేసినట్లు సమాచారం.
గత మూడు రోజులుగా రోజులుగా తన మనవడిపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్ చూసి వృద్ధురాలైన శకుంతలమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనవడిపై జరుగుతున్న ఈ దుష్ప్రచారం సృష్టించిన మానసిక ఒత్తిడి, ఆవేదన తట్టుకోలేకనే ఆమెకు గుండెపోటు వచ్చిందని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
తన తల్లికి గుండెపోటు వచ్చిందనే వార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన కార్యక్రమాలను తక్షణమే రద్దు చేసుకుని ఆయన నేరుగా గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి, సర్జరీ తర్వాతి రికవరీ గురించి అక్కడి డాక్టర్ల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, కుమారుడిపై చట్టపరమైన ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుండగా.. ప్రాణసమానమైన తల్లి ఇలా ఆసుపత్రి పాలు కావడం బండి సంజయ్ వ్యక్తిగత జీవితంలో అత్యంత కఠినమైన సమయంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ శ్రేణులు, సంజయ్ అభిమానులు శకుంతలమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.







