18 నుంచి పర్యాటక వారోత్సవాలు : మంత్రి జూపల్లి
మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్ (Brochure) ను సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతి, ఎకో-టూరిజం (Eco-tourism) ప్రదేశాలను ప్రమోట్ చేయడంతోపాటు పర్యాటక రంగం ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు.రాష్ట్రంలో పర్యాటక రంగానికి తిరుగులేని ఆదరణ ఉందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక పర్యాటక ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు.






