బండి భగీరథ్‌కు హైకోర్టు షాక్..!
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు తీవ్రతను, బాధితురాలిపై వచ్చిన ఆరోపణల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బండి భగీరథ్‌ను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం బలమైన వాదనలు వినిపించారు. బాధితురాలి ప్రవర్తన, ఘటన జరిగినట్లు చెబుతున్న సమయం, కాల్ రికార్డులు, సోషల్ మీడియా చాటింగ్ వివరాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై అనేక అనుమానాలు ఉన్నాయని, రాజకీయ లేదా ఇతర కారణాలతోనే తన క్లయింట్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని వాదించారు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… 2025 డిసెంబర్ 31వ తేదీ నుండి రెండు రోజుల పాటు ఆమె కూతురిని మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో ఉంచారని, అక్కడ బలవంతంగా మద్యం తాగించారని ఆరోపించారు. అయితే, అదే ఫామ్ హౌస్‌లో బాధితురాలితో పాటు నిందితుడు, మరో ఐదుగురు స్నేహితులు కూడా ఉన్నారని ఫిర్యాదులోనే పేర్కొన్న విషయాన్ని లాయర్ గుర్తుచేశారు. అక్కడ స్నేహితులు తీసిన ఫొటోలు, వీడియోలను పరిశీలిస్తే బాధితురాలు ఎలాంటి బలవంతం లేకుండా, తన స్వచ్ఛంద ఇష్టంతోనే మద్యం సేవించినట్లు స్పష్టమవుతోందని కోర్టుకు తెలిపారు. అవసరమైతే ఆ డిజిటల్ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. శారీరక దాడి లేదా వేధింపులు జరిగినట్లు చెబుతున్న ఘటనకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయానికి మధ్య దాదాపు నాలుగున్నర నెలల సుదీర్ఘ ఆలస్యం జరిగిందని న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించకుండా, ఇంత కాలం ఆగి ఫిర్యాదు చేయడం వెనుక అనేక సందేహాలు ఉన్నాయని వాదించారు. తన కుమార్తె మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతోందని తెలిసినప్పటికీ, బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం 2025 అక్టోబర్ 25వ తేదీన శారీరక వేధింపులు జరిగాయని బాధితురాలి తరపున పేర్కొన్నారు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 26న బాధితురాలే స్వయంగా నిందితుడికి సినిమా టిక్కెట్లు పంపిస్తూ, తనతో కలిసి సినిమాకు రావాలని కోరినట్లు డిఫెన్స్ లాయర్ ఆధారాలు చూపారు.
వేధింపులు జరిగాయని చెబుతున్న కాలం తర్వాత కూడా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయని న్యాయవాది వాదించారు. ముఖ్యంగా 2025 నవంబర్ 12, 13, 14 తేదీల్లో బాధితురాలు నిందితుడితో దాదాపు 8 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడిందని, నవంబర్ 14న గంటల తరబడి ఇద్దరి మధ్య చాటింగ్ సాగిందని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన ఏ బాధితురాలైనా నిందితుడితో ఇంత సుదీర్ఘంగా, సన్నిహితంగా ఫోన్ సంభాషణలు లేదా చాటింగ్ కొనసాగించడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో ఆరోపణలపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమైనప్పుడు, గతంలో అనేక ఉన్నత న్యాయస్థానాలు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఉదాహరణలను న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయినప్పటికీ, తెలంగాణ హైకోర్టు ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించలేదు.
మైనర్లపై జరిగే లైంగిక నేరాల తీవ్రత, ఆరోపణల వెనుక ఉన్న ప్రాథమిక సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ తీర్పుతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. హైకోర్టు నుంచి ఎలాంటి రక్షణ లభించకపోవడంతో, సిట్ అధికారులు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు.







