క్రికెట్ ఫ్యాన్స్ జాగ్రత్త.. ఐపీఎల్ టికెట్ల పేరుతో హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసాలు..!
భాగ్యనగరంలో ఐపీఎల్ (IPL 2026) మ్యాచ్‌ల ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్న క్రికెట్ అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ టికెట్ల విక్రయాల పేరుతో నగరంలో కొత్త రకం సైబర్ మోసాలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. నకిలీ యాప్స్, వెబ్సైట్లతో సంచరిస్తున్న కేటుగాళ్ల ముఠాలు అమాయక క్రికెట్ ఫ్యాన్స్ జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి.
ఈ మోసాల కోసం సైబర్ కేటుగాళ్లు ఒక వినూత్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఐపీఎల్ టికెట్ల అధికారిక విక్రయ భాగస్వామి అయిన district.in పోర్టల్‌ను తలపించేలా ఒక నకిలీ యాప్ మరియు వెబ్‌సైట్‌ను సృష్టించారు. అనంతరం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో “బ్లాక్‌లో ఉన్న ఐపీఎల్ టికెట్లు అత్యంత తక్కువ ధరకే లభించును” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తున్నారు.
స్టేడియంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే స్టాండ్స్ టికెట్లను సైతం ఆన్లైన్లో తక్కువ ధరకే చూపిస్తూ అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నకిలీ లింకులను నమ్మి, మ్యాచ్ టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేసిన క్రికెట్ అభిమానులు.. ఆ తర్వాత టికెట్లు రాకపోవడంతో తీవ్రంగా ఖంగుతింటున్నారు. తీరా మోసపోయామని గ్రహించే లోపే సైబర్ ముఠాలు సదరు వెబ్సైట్లను క్లోజ్ చేసి మాయమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరియు హైదరాబాద్ నగర పోలీసులు సంయుక్తంగా క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లింక్‌లు, అనధికారిక యాప్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.







