ఈ నిర్ణయం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం రేవంత్
దేశవ్యాప్తంగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం విమర్శించారు.
ప్రపంచంలో భారత్ (India) ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం అని పదే పదే ప్రకటించిందని గుర్తుచేశారు. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతుకం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.







