లక్షల ఖర్చు ఎందుకు? మైక్రో వెడ్డింగ్’తో ట్రెండ్ మారుస్తున్న నేటి యూత్
Micro-Wedding: పెళ్లి అంటే కేవలం ఊరంతా చెప్పుకునేలా భారీగా ఖర్చు చేయడం, డీజే మోతలు, మిరుమిట్లు గొలిపే లైటింగ్, వందల రకాల వంటకాలతో హడావుడి చేయడమే అనే ధోరణి ప్రస్తుతం సమాజంలో బలంగా ఉంది. ఒకరిని చూసి మరొకరు హోదా కోసం చేస్తున్న ఈ పోటీ వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పెను ఆర్థిక భారం పడుతోంది. అయితే, ఈ ఆడంబరాలకు పోకుండా, నేటి తరం సరికొత్త బాట పడుతోంది. ఖర్చును తగ్గించి, అర్థవంతమైన వేడుకలకు ప్రాధాన్యం ఇస్తూ ‘మైక్రో వెడ్డింగ్’ సంస్కృతికి తెరలేపుతోంది.
జీవితకాలపు సంపాదన ఖర్చు..
ప్రస్తుత రోజుల్లో ఒక వివాహం కోసం సగటున రూ. 30 నుండి రూ. 70 లక్షల వరకు ఖర్చు చేయడం సర్వసాధారణంగా మారింది. కేవలం ఒక్కరోజు వేడుక కోసం తల్లిదండ్రులు తమ జీవితకాలపు సంపాదనను కరిగించేస్తున్నారు. కానీ, నేటి యువత ఈ వృథా ఖర్చును వ్యతిరేకిస్తోంది. “ఎందుకు అంత ఖర్చు?” అంటూ ఆ మొత్తాన్ని ఆస్తుల కొనుగోలుకో లేదా వ్యాపార పెట్టుబడులకో మళ్లించాలని భావిస్తోంది. పెళ్లి కోసం ఆస్తులు అమ్మడం కాకుండా, తమ సంపాదనతో ఇల్లు కట్టుకుని, అదే ఇంట్లో గృహప్రవేశంతో పాటు వివాహం కూడా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మైక్రో వెడ్డింగ్ ప్రత్యేకతలు..
వందల సంఖ్యలో కాకుండా కేవలం ప్రాణస్నేహితులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుకను జరుపుకుంటున్నారు. భారీ వివాహాల్లో జరిగే ఆహార వృథాను నివారించడమే కాకుండా, పర్యావరణహితమైన ఏర్పాట్లకు మొగ్గు చూపుతున్నారు. కొందరు యువతీ యువకులు ఆడంబరాల కోసం ఉంచిన డబ్బును అనాథాశ్రమాలకు లేదా సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తక్కువ మంది గెస్టులతో ఈవెంట్ ప్లాన్ చేయడం వల్ల ఎటువంటి గందరగోళం లేకుండా పెళ్లి తంతును మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు.
లోకం ఏమనుకుంటుందో అన్న భయం కంటే, తమ భవిష్యత్తుకు ఏది ముఖ్యమో అనే స్పష్టత నేటి యువతలో పెరుగుతోంది. ఆర్భాటాల కంటే ఆత్మీయతకే పెద్దపీట వేస్తూ, నిరాడంబర వివాహాలతో సరికొత్త సామాజిక మార్పుకు వీరు శ్రీకారం చుడుతున్నారు.







