హాలిడేస్‌లో మీ పిల్లలు సేఫ్‌గా ఉండాలా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Child Care: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. హోం వర్క్‌లు, చదువుల ఒత్తిడి లేకపోవడంతో ఆరేళ్ల నుండి పదేళ్ల వయస్సు గల పిల్లలందరూ ఆటపాటల వైపు మొగ్గు చూపుతారు. స్నేహితులతో సరదాగా గడపడం, ఈతకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే, తల్లిదండ్రులు తమ దైనందిన పనుల్లో నిమగ్నమైన సమయంలో పిల్లలు ప్రమాదాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ విషయాల్లో అప్రమత్తత అవసరం..
ఇళ్లు లేదా అపార్ట్మెంట్లలో నీటి సంపుల మూతలు తెరిచి ఉండటం వల్ల ప్రమాదవశాత్తూ చిన్నారులు అందులో పడి మరణిస్తున్నారు. ఇటీవల మియాపూర్‌లో ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. కాబట్టి, సంపులు, అండర్ గ్రౌండ్ ట్యాంకులకు ఎప్పుడూ తాళాలు వేయాలి. అలాగే గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఒక బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన కలచివేసింది. 12 ఏళ్ల లోపు పిల్లలను లిఫ్టుల్లోకి ఒంటరిగా పంపకూడదు. లిఫ్ట్ మధ్యలో నిలబడాలని, తలుపుల దగ్గరకు వెళ్లకూడదని వారికి అవగాహన కల్పించాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందున పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారిని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ, నిమ్మరసం వంటివి ఇవ్వాలి. అతి శీతల పానీయాలకు దూరంగా ఉంచడం మంచిది. సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లకు ఎక్కువగా అలవాటు పడే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారిని ఆటలు, సంగీతం, నృత్యం వంటి ఇతర కళల వైపు ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు..
పిల్లలను చెరువులు, బావుల వద్దకు ఈత కోసం ఒంటరిగా పంపవద్దు. ఒకవేళ ఈత కొలనులకు పంపాలనుకుంటే అక్కడ శిక్షకులు, భద్రతా ప్రమాణాలు ఉన్నాయో లేదో సరిచూసుకుని పంపాలి. మోటారు సైకిల్ కీలను పిల్లలకు ఇవ్వకూడదు. ఇది వారిని ప్రమాదకరమైన డ్రైవింగ్ వైపు నడిపించవచ్చు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలను బయటకు పంపకండి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే ఆడుకునేలా చూడాలి. నిప్పుతో ఆటలు, ఎలక్ట్రిక్ ప్లగ్ పాయింట్లలో వేళ్లు పెట్టడం వంటివి చేయకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలి. పుస్తకాలు చదవడం, తాతయ్య, అమ్మమ్మలతో మాట్లాడటం వంటి మంచి అలవాట్లను ప్రోత్సహించి కొత్త విషయాలు నేర్చుకునేలా చేయాలి.
పిల్లల ఉత్సాహం ప్రమాదంగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యంత కీలకం. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉంటేనే ఈ వేసవి సెలవులను వారు సురక్షితంగా, సంతోషంగా గడపగలరు.







