కాలివేళ్లపై వెంట్రుకలు రాలిపోతున్నాయా? ఇది దేనికి సంకేతమంటే..
Heart health : మన శరీరంలో కనిపించే చిన్నపాటి మార్పులు కూడా కొన్నిసార్లు భవిష్యత్తులో రాబోయే పెద్ద ఆరోగ్య సమస్యలను ముందుగానే సూచిస్తాయి. చాలామంది సాధారణంగా కాళ్లు లేదా కాలివేళ్లపై పెరిగే వెంట్రుకలను కేవలం అందానికి సంబంధించిన విషయంగానే చూస్తుంటారు. ముఖ్యంగా మహిళలతో పాటు కొంతమంది పురుషులు కూడా ఆ వెంట్రుకలను వ్యాక్సింగ్ లేదా షేవింగ్ ద్వారా తొలగిస్తుంటారు. అయితే, ఈ చిన్న వెంట్రుకలు మన గుండె ఆరోగ్యాన్ని, శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉందో చెప్పే కీలక సూచికలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రక్త ప్రసరణకు.. వెంట్రుకల పెరుగుదలకు ఉన్న సంబంధం..
మన గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ రక్తం ద్వారానే శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, అవసరమైన పోషకాలు అందుతాయి. మన శరీర భాగాలన్నింటిలోకి పాదాలు, కాలివేళ్లు గుండెకు అత్యంత దూరంగా ఉంటాయి. కాబట్టి అక్కడి వరకు రక్తం సరిగ్గా సరఫరా కావడం చాలా ముఖ్యం. రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా సాగినప్పుడే పాదాల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు, కాలివేళ్లపై వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి. ఒకవేళ రక్తనాళాలు ఇరుకుగా మారినా, వాటిలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినా లేదా గుండె పనితీరు మందగించినా.. కాళ్ల చివరి భాగాల వరకు రక్తం సరిగ్గా చేరదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలివేళ్లపై ఉన్న వెంట్రుకలు అకస్మాత్తుగా ఊడిపోవడం లేదా కొత్తగా పెరగకపోవడం జరుగుతుంది.
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలివేళ్లపై అకస్మాత్తుగా వెంట్రుకలు తగ్గిపోవడం అనేది ‘పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్’ (Peripheral Artery Disease – PAD) అనే తీవ్రమైన సమస్యకు ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ వ్యాధి బారిన పడినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా కాళ్లకు తగినంత ఆక్సిజన్ అందదు. అలాగే టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో కూడా రక్తనాళాలు బలహీనపడటం వల్ల పాదాల వద్ద వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది.
గమనించాల్సిన లక్షణాలు..
కేవలం వెంట్రుకలు ఊడిపోవడమే కాకుండా, రక్త ప్రసరణ సమస్యలను గుర్తించడానికి మరికొన్ని లక్షణాలను కూడా గమనించాలి.
- కాళ్లు ఎప్పుడూ చల్లగా ఐస్లా అయిపోవడం.
- నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు కాళ్ల కండరాల్లో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి రావడం.
- పాదాల చర్మం చాలా పల్చగా మారి, షైనీగా (మెరుస్తూ) కనిపించడం.
- కాళ్లకు అయ్యే చిన్న చిన్న గాయాలు లేదా దెబ్బలు త్వరగా మానకపోవడం.
నిపుణుల కీలక సూచనలు..
అయితే, ప్రతి ఒక్కరిలో వెంట్రుకల పెరుగుదల ఒకేలా ఉండదు. వయసు పెరగడం, హార్మోన్ల హెచ్చుతగ్గులు , జన్యుపరమైన కారణాల వల్ల కూడా వెంట్రుకలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి కాలివేళ్లపై వెంట్రుకలు లేనంత మాత్రాన గుండె జబ్బు ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ, బాగా పెరుగుతున్న వెంట్రుకలు అకస్మాత్తుగా రాలిపోతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కొవ్వు, చక్కెర పదార్థాలను తగ్గించి సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.







