డెట్ మ్యూచువల్ ఫండ్స్ vs బ్యాంక్ FD.. సురక్షితమైన రాబడి కోసం ఏది బెస్ట్ ఛాయిస్?
Debt Mutual Funds: భారతదేశంలో తక్కువ రిస్క్ తీసుకుంటూ, తమ పెట్టుబడికి స్థిరమైన , సురక్షితమైన రాబడిని ఆశించేవారికి డెట్ మ్యూచువల్ ఫండ్లు (Debt Mutual Funds), బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు (Bank FDs) ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతలుగా ఉంటాయి. పెట్టుబడిదారులందరూ ఈ రెండింటినీ ఎక్కువగా నమ్ముతారు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో దేని ప్రత్యేకతలు, ప్రయోజనాలు , పరిమితులు దానికున్నాయి. మీ దగ్గరున్న అదనపు నగదును మదుపు చేసి, మంచి లాభాలు ఆర్జించాలనుకుంటే.. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకోగలరు.
డెట్ ఫండ్లు – బ్యాంకు ఎఫ్డీల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇవే..
రాబడి (Returns)..
బ్యాంకు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టే సమయంలోనే స్థిరంగా ఎంత వడ్డీ వస్తుందో తెలుస్తుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్ల రాబడి మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎఫ్డీ కంటే డెట్ మ్యూచువల్ ఫండ్లలో కొంచెం ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
రిస్క్ (Risk)..
బ్యాంకు ఎఫ్డీలు అత్యంత సురక్షితమైనవి. వీటికి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) రక్షణ ఉంటుంది. డెట్ ఫండ్లలో రిస్క్ తక్కువగానే ఉన్నప్పటికీ, మార్కెట్ కదలికల వల్ల స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉంది.
నగదుగా మార్చుకోవడం (Liquidity)..
డెట్ ఫండ్లలోని ఓపెన్-ఎండెడ్ స్కీమ్స్ నుండి డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, బ్యాంకు ఎఫ్డీలలో నిర్ణీత గడువుకు ముందే డబ్బులు వెనక్కి తీసుకుంటే (Premature Withdrawal) కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను విధానం (Taxation)..
బ్యాంకు ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 40,000 (సీనియర్ సిటిజన్లకు రూ. 50,000) దాటితే బ్యాంకులు టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్ల విషయానికొస్తే.. మీ ఆదాయపు పన్ను స్లాబ్ (Income Tax Slab) ప్రకారం వచ్చే లాభాలపై టాక్స్ వర్తిస్తుంది.
పెట్టుబడి కాలపరిమితి..
బ్యాంకు ఎఫ్డీలను 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు నిర్ణీత కాలానికి ఫిక్స్ చేసుకోవచ్చు. డెట్ ఫండ్లు మాత్రం స్వల్పకాలిక అవసరాల నుండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల వరకు అన్ని రకాల కాలపరిమితులకు అనుకూలంగా ఉంటాయి.
నిపుణుల సూచన..
మీకు పైసా రిస్క్ వద్దు, కచ్చితమైన రాబడి కావాలి అనుకుంటే బ్యాంకు ఎఫ్డీలు (Bank FDs) ఉత్తమమైనవి. అలా కాకుండా, మార్కెట్ కదలికలను బట్టి ఎఫ్డీ కంటే కాస్త మెరుగైన రాబడితో పాటు, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు వెనక్కి తీసుకునే వెసులుబాటు (Flexibility) కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీ ఆర్థిక అవసరాలను బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవడం మంచిది.







