అత్యున్నత స్థాయికి భారత్-యూఏఈ సంబంధాలు..!
భారత్, యూఏఈ వాణిజ్య బంధం మరింత బలోపేతమైంది. మోడీ యూఏఈ పర్యటనలో ఇంధన భద్రత, ఆర్థిక సహకారం లక్ష్యంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్లోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో (ఎస్పీఆర్) 30 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురును నిల్వ చేయడానికి యూఏఈ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అబుదాబి పర్యటన సందర్భంగా ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన విస్తృత స్థాయి చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం భారత్ ఇంధన భద్రతకు మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురుతో పాటు భారత్లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటుకు కలిసి పనిచేయాలని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందాన్ని కూడా ఇరు దేశాలు స్వాగతించాయి.
ఇంధన రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా భారత్లోని బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ రంగాల్లో యూఏఈ 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రక్షణ, నౌకా సహకారం, షిప్ బిల్డింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లోనూ నూతన ఒప్పందాలు కుదిరాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చర్చల సందర్భంగా హర్మూజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత రవాణా, నిరంతరాయ వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను ఇరు నేతలు నొక్కిచెప్పారు. యూఏఈపై ఇటీవల జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ పునరుద్ఘాటించి, ఆ దేశానికి సంఘీభావం ప్రకటించారు. మొత్తంమీద ఈ పర్యటన ఇంధన భద్రత, ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసే దిశగా భారత్-యూఏఈ సంబంధాలను మరింత పటిష్టం చేసింది.







