తైవాన్ విషయంలో అమెరికా యూటర్న్..?
తైవాన్ స్వతంత్రత విషయంలో సుదీర్ఘంగా మద్దతుగా ఉన్న అమెరికా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుందా..? ఇక తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చే పరిస్థితి లేదా..? ముఖ్యంగా బీజింగ్ లో చైనా అధ్యక్షుడితో చర్చలు, షీ బెదిరింపులతో ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారా..? చైనా అధినేత బెదిరింపులకు ట్రంప్ లొంగిపోయారా..? లేక హర్మూజ్ విషయంలో సహకారానికి .. తైవాన్ స్వతంత్రతకు చైనా లింక్ పెట్టిందా..?
తైవాన్ అంశం (Taiwan)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు.ఈ ద్వీపం.. చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అమెరికాకు మాత్రం 15 వేల కి.మీ.కు పైగా దూరాన ఉంది. ఎక్కువ దూరం కావడంతో మేం వేగంగా స్పందించడం కష్టమే. చైనా చాలా శక్తిమంతమైన, పెద్ద దేశం కూడా. ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్లు సంయమనం పాటించాలి’’ అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. వారి స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం అంతదూరం ప్రయాణించి మేం యుద్ధం చేయాలని అనుకోవడం లేదన్నారు. చైనా పర్యటన అనంతరం ట్రంప్ (Donald Trump) ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే.. అమెరికా-చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టం చేశారు.ఈనేపథ్యంలో అమెరికా- చైనాలు భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్పా… ప్రత్యర్థులుగా కాదని జెన్‌పింగ్ తేల్చి చెప్పారు.
తైవాన్ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా (China) కోరుకుంటోంది. తైవాన్ స్వాతంత్య్రాన్ని అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నది చైనా వాదన. ‘తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగరాదు’ అని ఇంతకాలం అమెరికా స్పష్టంచేస్తూ వచ్చింది. దానికి భిన్నంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడమూ ఆయన వైఖరిలో మార్పును వెల్లడిస్తోంది.







