వెండి దిగుమతులపై నిషేధం… ఉచితం నుంచి పరిమిత వర్గంలోకి.. అంటే ఏమిటి?
పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానానికి సవరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా విదేశీ వాణిజ్య విభాగం ప్రకటించింది.
విదేశీ మారకపు ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకునేందుకు వీలుగా బంగారం కొనడాన్ని యేడాది పాటు నిలిపేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈ రెండింటి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు.
భారత్ లో వెండి, బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రజలు పెట్టుబడుల కోసం, ఆభరణాల కోసం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేవీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటికి వెళ్తుంది. దీంతో వాణిజ్య లోటు పెరిగి, రూపాయిపై ప్రభావం పడుతుంది.
అందుకే ప్రభుత్వం బంగారం, వెండి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం ఏఐడీసీ వుంటుంది.
తాజాగా.. వెండి దిగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఉచితం నుంచి పరిమిత వర్గంలోకి మార్చేసింది. ఉచితం అంటే.. ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. పరిమిత వర్గంలో అయితే ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. దీంతో దిగుమతులు నియంత్రణలోకి వస్తాయి.







