బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా డేటా లీక్..?
ప్రముఖ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ (Bank of Baroda) ఒక భారీ సైబర్ విపత్తును ఎదుర్కొంటున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఒక అజ్ఞాత హ్యాకర్ గ్రూప్ బ్యాంక్ అంతర్గత వ్యవస్థల్లోకి చొరబడి, ఏకంగా 1 టెరాబైట్ పరిమాణంగల అత్యంత సున్నితమైన కస్టమర్ డేటాను దొంగిలించినట్లు సైబర్ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ డేటా మొత్తాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో (Dark Web) ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు.
ఈ లీకైన డేటాబేస్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంక్ బ్రాంచ్‌లకు చెందిన కస్టమర్ల వ్యక్తిగత, కార్పొరేట్ బ్యాంకింగ్ వివరాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఖాతాదారుల పేర్లు, ఆధార్ నంబర్లు, సేవింగ్స్ మరియు కరెంట్ అకౌంట్ రికార్డులు, లోన్ నంబర్లు, నెట్ బ్యాంకింగ్ యూజర్ల లాగిన్ సమాచారం, ఎన్ఆర్ఐ (NRI) బ్యాంకింగ్ సేవలు మరియు కస్టమర్ సపోర్ట్ డాక్యుమెంట్లు ఉన్నట్లు హ్యాకర్లు ప్రకటించారు. అంతేకాకుండా బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, అంతర్గత కమ్యూనికేషన్ ఫైళ్లు, విజిలెన్స్ దర్యాప్తు వివరాలు మరియు ఏటీఎం సంబంధిత రికార్డులు కూడా ఇందులో బహిర్గతమయ్యాయి.
ఈ డేటా లీక్‌కు సంబంధించిన కొన్ని నమూనా పత్రాలను హ్యాకర్లు ఆన్లైన్లో విడుదల చేయగా, ప్రముఖ సైబర్ భద్రతా నిపుణుడు మరియు ‘క్యాష్‌లెస్ కన్జ్యూమర్’ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ వాటిని పరిశీలించారు. ఆ స్క్రీన్షాట్లు, డౌన్లోడ్ లింకులు నిజమైనవేనని, అవి స్పష్టంగా బ్యాంక్ అంతర్గత రికార్డులుగానే కనిపిస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా ధృవీకరించారు. ఈ పరిణామాన్ని డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఒక పెద్ద ‘సైబర్ విపత్తు’గా ఆయన అభివర్ణించారు. ఈ దాడి వెనుక ‘ట్రిపుల్ ఎక్స్’ అనే అంతర్జాతీయ హ్యాకింగ్ గ్రూప్ ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కాగా ఈ సైబర్ దాడి మరియు డేటా లీక్ ఆరోపణలపై ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ యాజమాన్యం గానీ, అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.








