తప్పనిసరి పరిస్థితుల్లోనే మహానాడు రద్దు : ఎమ్మెల్యే కోటంరెడ్డి
మహానాడు (Mahanadu) కార్యక్రమం రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) అన్నారు. నెల్లూరులో మహానాడును భారీ స్థాయిలో నిర్వహించాలని అందరం భావించామని తెలిపారు. మహానాడు చరిత్రలో నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తర్వాత అని చెప్పుకునేలా ఈసారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయితే దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన పొదుపు పిలుపుకు స్పందిస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మహానాడును రద్దు చేసినట్లు తెలిపారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహానాడు నిర్వహించనున్నారని చెప్పారు. మహానాడు రద్దు కావడం పార్టీ శ్రేణులకు నిరాశ కలిగించినప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం చంద్రబాబు, నారా లోకేష్ (Nara Lokesh) తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఇదే సింహపురి గడ్డ అయిన నెల్లూరు జిల్లాలో మహానాడును ఘనంగా నిర్వహించాలని సామాన్య టీడీపీ కార్యకర్తగా చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు.







