వేసవిలో పదే పదే ఫేస్ వాష్ వాడుతున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే..
Skin Care: వేసవి కాలం రాగానే చెమట, దుమ్ము, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా మారడం సహజం. ఈ జిడ్డు నుండి ఉపశమనం కోసం చాలా మంది రోజులో పదే పదే ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుగుతుంటారు. ముఖం శుభ్రంగా ఉంటుందని ఇలా చేస్తారు కానీ, దీనివల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని చర్మ నిపుణులు (Dermatologists) హెచ్చరిస్తున్నారు.
ఎక్కువసార్లు ముఖం కడగడం వల్ల కలిగే నష్టాలు..
పదే పదే ఫేస్ వాష్ చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచే సహజసిద్ధమైన నూనెలు (Natural Oils) నశిస్తాయి. దీంతో ముఖం పొడిబారిపోయి, గట్టిగా తయారవుతుంది. చర్మం తన తేమను కోల్పోయినప్పుడు, ఆ తేమను తిరిగి సమతుల్యం చేయడానికి మన శరీరం మరింత ఎక్కువగా ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ముఖం ముందు కంటే ఎక్కువ జిడ్డుగా మారి బ్లాక్‌హెడ్స్ , మొటిమల సమస్యలు పెరుగుతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ముఖం ఎర్రగామారటం, దురద, మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.
చర్మ నిపుణుల సూచనలు ..
రోజుకు కేవలం రెండు సార్లు (ఉదయం , రాత్రి పడుకునే ముందు ) ఫేస్ వాష్ ఉపయోగిస్తే సరిపోతుంది. వేసవిలో బయటికి వెళ్లి వచ్చినప్పుడు లేదా ఎక్కువ చెమట పట్టినప్పుడు ఫేస్ వాష్ కాకుండా, కేవలం సాధారణ చల్లని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది. రసాయనాలు ఎక్కువగా ఉండే స్ట్రాంగ్ ఫేస్ వాష్‌లకు దూరంగా ఉంటూ, మీ చర్మానికి సరిపోయే ‘మైల్డ్’ లేదా జెంటల్ ఫేస్ వాష్లను ఎంచుకోవడం ఉత్తమం. వేసవిలో మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి తేలికపాటి (Light-weight) మాయిశ్చరైజర్, బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ కచ్చితంగా వాడాలి.
వేసవిలో చర్మ సంరక్షణ అంటే ముఖాన్ని పదే పదే కడగడం కాదు. సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవడం, మాయిశ్చరైజర్ రాయడం, అలాగే తగినంత నీరు తాగుతూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారానే వేసవిలో కూడా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు.







