ఐపీఎల్ ఫైనల్ కు పీసీబీ చీఫ్ కు ఆహ్వానం..?
భారత్ మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాల నేపథ్యంలో ఒక ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ఈ నెల మే 30, 31 తేదీలలో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ (ICC) బోర్డు సమావేశానికి హాజరుకావాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధినేత మొహసిన్ నఖ్వీకు అధికారిక ఆహ్వానం అందింది. నిజానికి ఈ ఐసీసీ సమావేశం దోహాలో జరగాల్సి ఉండగా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐసీసీ దీనిని భారత్‌కు మార్చింది.
దీంతో నిబంధనల ప్రకారం ఐసీసీ సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపిన క్రమంలో పీసీబీకి కూడా ఈ ఇన్విటేషన్ అందింది. అయితే, దీనికి తోడు అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి కూడా మొహసిన్ నఖ్వీకి అధికారిక ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ స్పోర్ట్స్ నెట్వర్క్ జియో సూపర్ పేర్కొనడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ మరియు టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో బీసీసీఐ (BCCI) మరియు పీసీబీ ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి.
పాకిస్థాన్‌లో ఆడటానికి టీమిండియా నిరాకరించడంపై నఖ్వీ ఘాటుగా స్పందించినప్పటికీ, చివరికి ఐసీసీ భారత్ వైపే మొగ్గు చూపడంతో పాక్ బోర్డు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య నఖ్వీ నేరుగా భారత్‌కు వస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం.. భారత్ పర్యటనకు రావాాలా వద్దా అనే విషయంపై మొహసిన్ నఖ్వీ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో, ఆయన భారత్‌కు రాకుండా పాకిస్థాన్ నుంచే వర్చువల్ పద్ధతిలో ఐసీసీ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.







