చిలుకూరు ఆలయంపై అమెరికా సెనెటర్ విమర్శ…హిందువుల ఆగ్రహం
హైదరాబాదుకు సమీపంలోని చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అక్కడికి వెళ్లి 108 సార్లు ప్రదక్షిణం చేస్తే ఖచ్చితంగా అమెరికా వీసా వస్తుందని చాలామంది భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఆయనను అందరూ వీసా బాలాజీ అని పిలుస్తుంటారు. ఇది కేవలం నమ్మకమే కాదు వేలు లక్షల మంది భక్తులకు నిజంగా జరిగింది కూడా. భారతీయులు ఎంతగానో నమ్మి కొలిచే ఆ దేవదేవుడిపై అమెరికా సెనెటర్ చేసిన నోటిదురుసు వ్యాఖ్యలు హిందువులను ఆగ్రహానికి గురిచేశాయి.
అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ భారతీయుల మీద, చిలుకూరు టెంపుల్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా హెచ1బీ వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఓ ట్వీట్ ద్వారా ఆరోపించారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువు అయ్యాక హెచ1బీ పొందుతారు. ఆ తర్వాత గ్రీన్‌కార్డు సాధిస్తారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో భారతీయులు ఉద్యోగాలను సాధిస్తుండటంతో పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు దారులు మూసేస్తున్నాయని, ప్రతిభ స్థానాన్ని జాతి పక్షపాతం ఆక్రమిస్తోందని ఆరోపించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించారు. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్‌ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. హెచ1బీ, ఎల1, ఎఫ1, ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎరిక్ ష్మిట్ భారతీయులపై.. ముఖ్యంగా హైదరాబాదీయులపై అక్కసు వెళ్లగక్కారు తన ట్వీట్లో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రస్ధావించడం విశేషం. ఈ వీసా కార్టెల్‌కు ఒక వీసాల దేవాలయం ఉంది. వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు” అని ష్మిట్ వ్యాఖ్యానించారు. చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్నీ తన పోస్టులో ఆయన ఉంచారు. ఇదే వీసాల దేవాలయమని, భారతీయులతోపాటు వీసా కార్టెల్ అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు.
ఇప్పుడు చిలుకూరి బాలాజీ ఆలయం పేరు ప్రపంచ వార్తల్లోకి వచ్చేసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని వివాదంలోకి లాగడంపై.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం, భారతీయ ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయుల సెంటిమెంట్ ను తూలనాడటం దురదృష్టకరమన్నారు. ఎరిక్ స్మిత్ లాంటి వాళ్లు భారతీయుల ప్రతిభను, హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, అమెరికా ప్రభుత్వం, అక్కడి సెనేట్ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, ఎరిక్ స్మిత్ వెంటనే భారతీయ సమాజానికి, హిందువులకు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.







