బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. వాట్ నెక్స్ట్?
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపుతున్న పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు పేట్ బషీరాబాద్ పోలీసులు, సిట్ అధికారులు దాదాపు రెండు గంటల పాటు భగీరథ్‌ను విచారించారు. అనంతరం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితురాలైన బాలిక, ఆమె కుటుంబ సభ్యులు మే మొదటి వారంలో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 8వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై కేసు నమోదైంది. బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు తీవ్రమైన పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12లతో పాటు, BNSలోని సెక్షన్ 74, 75 కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ పోలీసుల వద్దకు చేరిన తీరుపై ఇప్పుడు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. తన కుమారుడు చట్టాన్ని గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. “నా కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నప్పటికీ.. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని నేనే స్వయంగా సూచించాను” అని ఆయన ట్వీట్ చేశారు. న్యాయవాదుల ద్వారానే భగీరథ్‌ను విచారణ నిమిత్తం అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసుల వెర్షన్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోలేదని, తామే రంగంలోకి దిగి అప్పా జంక్షన్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. భగీరథ్ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో ప్రత్యేక పోలీస్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయని, పక్కా సమాచారంతోనే ఆయన్ను పట్టుకున్నామని వెల్లడించారు.
అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్న అనంతరం భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సిట్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా విచారించారు. అనంతరం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు పూర్తి చేసి మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. భగీరథ్‌కు మే 29 వరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. కేంద్రమంత్రి కుమారుడు పోక్సో కేసులో అరెస్ట్ కావడం, కోర్టు రిమాండ్ విధించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. భగీరథ్ కు బెయిల్ వస్తుందా.. రాదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.







