విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా పన్ను తగ్గించిన ప్రభుత్వం..!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ విమానయాన రంగం ఈ ఉద్రిక్తతల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆకాశాన్ని తాకుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – విమాన ఇంధనం) ధరలతో ఎయిర్‌లైన్స్ సంస్థలు (Flight Tickets) ఆర్థికంగా విలవిలలాడుతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో విమానయాన సంస్థలతో పాటు, సామాన్య ప్రయాణికులకు భారీ ఊరటనిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
18 శాతం పన్ను కట్!
విమాన ఇంధనంపై స్థానికంగా విధిస్తున్న ‘వ్యాట్’ (Value Added Tax)ను అమాంతం తగ్గిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏటీఎఫ్‌పై ఢిల్లీలో 25 శాతం మేర వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని ఏకంగా 7 శాతానికి కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకేసారి 18 శాతం మేర పన్ను భారాన్ని (Flight Tickets) ప్రభుత్వం తగ్గించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బ్యారెల్ ముడిచమురు ధరలు మండిపోతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విమానయాన రంగానికి సంజీవనిలా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రూ. 985 కోట్ల ఆదాయం వదులుకుని..
విమానయాన సంస్థల (Flight Tickets) ఆర్థిక కష్టాలను, ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ పన్ను తగ్గింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. ఈ సవరించిన (7%) వ్యాట్ రేట్లు రాబోయే ఆరు నెలల పాటు కచ్చితంగా అమలులో ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే పన్ను ఆదాయాన్ని వదులుకోవడం వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడనుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు రూ. 985 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా సరే, విమాన రాకపోకలను (Flight Tickets) ప్రోత్సహించడం, టికెట్ల భారం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా సర్కార్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
ఏదైనా ఒక విమానయాన సంస్థ (Airline) మొత్తం నిర్వహణ వ్యయాన్ని లెక్కేస్తే.. అందులో ఇంధన ఖర్చులే అత్యధికంగా దాదాపు 35 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. అంటే ఇంధన ధరల పెరుగుదల, తగ్గుదల నేరుగా విమాన ప్రయాణ చార్జీలపై (Flight Tickets) తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఢిల్లీలో భారీగా వ్యాట్ తగ్గడంతో, అక్కడి నుంచి రాకపోకలు సాగించే ఎయిర్‌లైన్స్‌కు ఇంధన కొనుగోలు ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది. తద్వారా ఆ ఆర్థిక ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదిలీ చేస్తే విమాన టికెట్ల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇటీవలే మహారాష్ట్ర కూడా ఏటీఎఫ్‌పై ఉన్న వ్యాట్‌ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశ రాజధాని కూడా అదే బాట పట్టడంతో, ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు ఇతర రాష్ట్రాలపై కూడా పన్నుల కోత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.







