ఇండియాలో స్టార్‌బక్స్ తొలి కార్పొరేట్ ఆఫీస్.. అసలు మాస్టర్ ప్లాన్ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం కాఫీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కాఫీ చైన్ దిగ్గజం ‘స్టార్‌బక్స్’ (Starbucks).. భారత్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం కాఫీ షాపులకే పరిమితం కాకుండా, దేశీయ టెక్నాలజీ రంగంలోకి భారీ స్థాయిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు, అత్యాధునిక టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు సరికొత్త ఉపాధి అవకాశాలు తలుపుతట్టనున్నాయి.
సొంత టెక్ సామ్రాజ్యంపై కన్ను!
ఈ సంచలన నిర్ణయం వెనుక స్టార్‌బక్స్ (Starbucks) భారీ వ్యూహమే దాగి ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది స్టార్‌బక్స్. ఇందులో భాగంగానే తన గ్లోబల్ కార్యకలాపాలకు అత్యంత కీలకమైన టెక్నాలజీ పనుల కోసం ఇకపై ‘థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ల’పై ఆధారపడటాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు కోట్ల రూపాయలు వెచ్చించి బయటి సంస్థల ద్వారా (Outsourcing) చేయించుకుంటున్న ఐటీ, టెక్ కార్యకలాపాలను ఇకపై పూర్తిగా తన సొంత ఉద్యోగులతోనే (In-house team) నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం అత్యుత్తమ టెక్ టాలెంట్ ఉన్న భారతదేశాన్ని ఒక ప్రధాన ‘గ్లోబల్ టెక్నాలజీ హబ్’గా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఖర్చుల తగ్గింపే ప్రధాన లక్ష్యం..
ఈ వ్యూహాత్మక మార్పుపై స్టార్‌బక్స్ (Starbucks) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) ఆనంద్ వరదరాజన్ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. “మధ్యవర్తుల దళారీ ఖర్చులను అరికట్టడం ద్వారా సంస్థ దీర్ఘకాలికంగా భారీ స్థాయిలో వ్యయ నియంత్రణ సాధించగలదు. అందుకే టెక్ కార్యకలాపాలను ఇతర సంస్థలకు అప్పగించకుండా పూర్తిగా సొంతంగా నిర్వహిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, వ్యయ నియంత్రణలో భాగంగా గతేడాది కాలంగా స్టార్‌బక్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అదే సంస్థ గ్లోబల్ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్‌లో ఈ కొత్త ఐటీ కేంద్రాన్ని స్థాపిస్తుండటం గమనార్హం. అంటే ఒకవైపు గ్లోబల్‌గా లేఆఫ్స్ ప్రకటిస్తూనే, మరోవైపు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ప్రతిభ దొరికే భారత్ వైపు తన దృష్టిని (Starbucks) మళ్లించింది.
ఎప్పటికల్లా ప్రారంభం అవుతుంది?
ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది చివరకల్లా ఈ కొత్త కార్పొరేట్ ఆఫీస్‌కు సంబంధించిన స్థలాన్ని ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే భారీ స్థాయిలో నియామక ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు ఈ టెక్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. మొత్తానికి ఒక కాఫీ బ్రాండ్‌గా దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్‌బక్స్ (Starbucks).. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌తో ఐటీ కొలువుల పండుగ తీసుకురావడం భారతీయ కార్పొరేట్ రంగానికి శుభపరిణామమేనని చెప్పాలి.







