దేశవ్యాప్తంగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. హైదరాబాద్, బెంగళూరులో అనూహ్య రికార్డు!
దేశంలోని ప్రధాన మహానగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందా? అంటే అవుననే అంటోంది ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రాప్‌టైగర్’ (PropTiger). దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డీలా పడిందని, టాప్-8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు (House Sales) సగటున 2 శాతం క్షీణించాయని తాజాగా విడుదల చేసిన జనవరి-మార్చి త్రైమాసిక నివేదికలో వెల్లడించింది.
ఎందుకీ క్షీణత?
గతేడాది ఇదే సమయంలో (జనవరి-మార్చి) 98,095 యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 95,973 యూనిట్లకు పడిపోయింది. సామాన్యులు, మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ‘అఫర్డబుల్ హౌసింగ్’ (తక్కువ ధరల ఇళ్లు) ప్రాజెక్టులు మార్కెట్లో పెద్దగా లేకపోవడమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని రిపోర్ట్ స్పష్టం చేసింది. డిమాండ్ మందగించినప్పటికీ, కొత్త ఇళ్ల ప్రాజెక్టుల సరఫరా (House Sales) మాత్రం మార్కెట్లో స్థిరంగానే కొనసాగుతోందని ప్రాప్‌టైగర్ సీఈఓ ప్రకాష్ తేజ్వాని వెల్లడించారు.
టాప్‌లో బెంగళూరు, హైదరాబాద్!
దేశవ్యాప్తంగా సగటు అమ్మకాలు తగ్గినా.. ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు మాత్రం రియల్ ఎస్టేట్‌లో (House Sales) మున్నెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి.
బెంగళూరు: ఈ త్రైమాసికంలో ఏకంగా 33 శాతం భారీ వృద్ధితో 15,603 ఇళ్ల విక్రయాలు జరిపి దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs), స్టార్టప్‌లు, డీప్-టెక్ కంపెనీల విస్తరణతో ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ అమాంతం పెరిగింది.
హైదరాబాద్: మన భాగ్యనగరం కూడా ఏమాత్రం తగ్గకుండా 25 శాతం బంపర్ గ్రోత్తో 13,297 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది.
వీటితో పాటు ఢిల్లీ-ఎన్సీఆర్ (11 శాతం వృద్ధితో 9,447 ఇళ్లు), చెన్నై (6,841 ఇళ్లు) మార్కెట్లు కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
చతికిలబడ్డ ముంబై, పూణే మార్కెట్లు
ఒకవైపు దక్షిణాది నగరాలు రియల్ ఎస్టేట్‌లో దూసుకుపోతుంటే, పశ్చిమ, తూర్పు భారత మార్కెట్లు మాత్రం తీవ్ర నిరాశపరిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) లో ఇళ్ల అమ్మకాలు (House Sales) అనూహ్యంగా 15 శాతం పడిపోయాయి. అలాగే పూణేలో 21 శాతం తగ్గుదల కనిపించింది. ఇక అహ్మదాబాద్‌లో 23 శాతం, కోల్‌కతాలో ఏకంగా 24 శాతం మేర విక్రయాలు పడిపోయాయి. ఈ నగరాల్లో ప్రాపర్టీ ధరలు మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేని విధంగా విపరీతంగా పెరిగిపోవడమే ఈ కొనుగోళ్ల పతనానికి కారణమని ప్రాప్‌టైగర్ నివేదిక తేల్చిచెప్పింది. మొత్తానికి దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు నగరాల వారీగా భిన్నమైన ట్రెండ్స్‌ను చూపిస్తోంది.







