భక్తి పారవశ్యంలో సెయింట్ లూయిస్.. వైభవంగా ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం’
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం రెండో రోజు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఆలయ యాగశాల భక్తులతో కిక్కిరిసిపోగా, వైదిక సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
రెండో రోజు ప్రధాన కార్యక్రమాలు:
గోమాత పూజ: కార్యక్రమాలు ఉదయం గోమాత పూజతో ప్రారంభమయ్యాయి.
రుద్రహోమం: రుత్వికులు శాస్త్రోక్తంగా మహాన్యాస పారాయణం చేశారు, అనంతరం లోకక్షేమం సర్వజన సుఖశాంతి కోసం రుద్రహోమం నిర్వహించారు.

దశసహస్ర మోదక హోమం: ఉదయం నిర్వహించిన ఈ హోమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన ఈ హోమం కోసం, ఆలయ వాలంటీర్లు భక్తిశ్రద్ధలతో 10,000 మోదకాలను స్వయంగా సిద్ధం చేశారు.
చండీ వారాహి హోమాలు: సాయంత్రం ఆదిపరాశక్తి అనుగ్రహం, ధర్మరక్షణ కోసం చండీ హోమం నిర్వహించారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వారాహి హోమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ మహాయాగం ఆరు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతిరోజూ విశిష్ట పూజలు, హోమాలు, చండీ పారాయణం రుద్రయాగాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు విజయ్ సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్ తెలిపారు. 30 మందికి పైగా రుత్వికులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మిగిలిన రోజుల కార్యక్రమాలకు కూడా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని మీడియా వ్యవహారాల సమన్వయకర్త రాజా సూరపనేని కోరారు








