ఆషాఢ బోనాలు.. అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
ఆషాడ మాస బోనాల ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి సూచికగా గోల్కొండ కోట (Golconda Fort)లో కొలువైన శ్రీ గోల్కొండ ఎల్లమ్మ (జగదాంబిక మహంకాళి) అమ్మ వారికి బంగారు బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివసత్తులు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య చోటా బజార్లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతచారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. లంగరహౌజ్ (Langar House) నుంచి భారీ తొట్టెలు, చోటా బజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గోల్కొండ కోటపై గల అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనవాయితీ ప్రకారం బంజారా దర్వాజ నుంచి పటేల్ లక్ష్మమ్మ కుటుంబం తరఫున శ్రీనాగేశ్వరస్వామి ఆలయం నుంచి మొదటి బోనాన్ని దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. గోల్కొండ కోటలో మొదటి పూజను కనులారా తిలకించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, సందర్శకులు తరలివచ్చారు.








