‘ఆ ఒక్కడి’ కోసం తెలంగాణ బీజేపీ వేట..!?
తెలంగాణ రాజకీయ చిత్రపటంపై కమలం పార్టీ వేగంగా విస్తరిస్తోంది. గత కొన్ని ఎన్నికల సరళిని గమనిస్తే బీజేపీ ఓటు బ్యాంకు, సీట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు నామమాత్రపు ఉనికికే పరిమితమైన పార్టీ, నేడు 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకునే స్థాయికి చేరిందంటే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాభవం ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను చూసిన తెలంగాణ ఓటర్లు… కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని, పార్టీ అందిస్తున్న హిందుత్వ నినాదాన్ని నమ్మి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇంత సానుకూల వాతావరణం ఉన్నా, రేపటి ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకోవాలనే బీజేపీ కల నిజమవ్వడానికి ఒక పెద్ద అడ్డంకి పదే పదే తెరపైకి వస్తోంది. అదే… సమర్థవంతమైన, రాష్ట్ర స్థాయి ‘మాస్ లీడర్’ లేకపోవడం.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఓటు బ్యాంకు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా, దానిని క్షేత్రస్థాయిలో ఓట్లుగా మార్చి పోలింగ్ బూత్ వరకు నడిపించే బలమైన వ్యూహకర్త, ప్రజాకర్షక నాయకుడు కరవయ్యారు. ప్రత్యర్థి పార్టీలను గమనిస్తే… కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి లాంటి దూకుడున్న మాస్ లీడర్ ఉన్నారు. బీఆర్ఎస్ వైపు చూస్తే కేసీఆర్ చరిష్మాతో పాటు కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాగ్ధాటి, జనాలను ఆకట్టుకునే నేతలున్నారు. కానీ బీజేపీలో మైకు పడితే జనాలను తనవైపు తిప్పుకుని, అధికార పీఠం వైపు నడిపించగల అగ్రనేత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు సౌమ్యులుగా ముద్రపడ్డారు. క్లిష్టమైన రాజకీయ పోరాటాల్లో ఇలాంటి సౌమ్యత పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. మరోవైపు బండి సంజయ్ మాటలు, లక్ష్మణ్ లాంటి నేతల ఉపన్యాసాలు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను పూర్తి స్థాయిలో సమ్మోహన పరచలేకపోతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే స్థానిక నేతలు బలంగా ఉన్నారు. దాదాపు 30 స్థానాల్లో మినహా, మిగిలిన చోట్ల కేవలం నరేంద్ర మోదీ ముఖాన్ని చూసి లేదా పార్టీ సిద్ధాంతాన్ని చూసి ఓట్లేయాల్సిన పరిస్థితి ఉంది.
పట్టణ ప్రాంతాల్లో మోదీ ఇమేజ్ పనిచేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థానిక నాయకత్వ బలం, ప్రజల్లో నిరంతరం ఉండే మాస్ లీడర్ చరిష్మా మాత్రమే ఓట్లను రాల్చగలవు. ఈ బలహీనతను పసిగట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి ప్రత్యర్థి నేతలు ఢిల్లీ వేదికగా సైతం “తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు” అని ధీమాగా సవాల్ విసరగలుగుతున్నారు. ఓటు బ్యాంకు ఉన్నా, దానికి సరైన దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేకపోతే ఎన్నికల రేసులో వెనుకబడక తప్పదనే విషయం కమలనాథులకు అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధిష్టానం ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ ఇమేజ్‌పైనే ఆధారపడకుండా… తెలంగాణ మట్టి వాసన తెలిసిన, దూకుడుగా ఉంటూ ప్రజలను ఉర్రూతలూగించగల ఒక సమర్థవంతమైన ‘మాస్ లీడర్’ కోసం అధిష్టానం వేట మొదలుపెట్టింది. లీడర్షిప్ లోపాన్ని సవరించుకుంటేనే వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడం సాధ్యమవుతుందని అటు పార్టీ శ్రేణులు, ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నాయకత్వ లోటును బీజేపీ ఎంత త్వరగా భర్తీ చేస్తుందనే దానిపైనే ఆ పార్టీ తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది.








