వైసీపీ ఎమ్మెల్సీకి బిగ్ షాక్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(ysrcp) ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై విశాఖపట్నంలోని ప్రముఖ విద్యాసంస్థ గీతం (GITAM) యూనివర్సిటీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విద్యాసంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆమె వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, రూ.5 కోట్ల భారీ పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు గీతం వర్సిటీ ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గీతం యూనివర్సిటీకి చెందిన సొంత స్థలంలో యాజమాన్యం ఒక ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది.
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కావాలనే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, సదరు నిర్మాణంపై తీవ్ర అసత్య ప్రచారం చేస్తున్నారని వర్సిటీ యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గీతం సంస్థలపై వరుదు కల్యాణి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక విద్యాసంస్థపై ఆమె బురదజల్లుతున్నారని మండిపడింది. ఈ ఆరోపణలు సత్యదూరంగా ఉండటం వల్లే తాము చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యామని పేర్కొంది.
ఈ విషయమై గీతం యూనివర్సిటీ తరపు న్యాయవాది టి.కనకరాజు అధికారికంగా వివరాలు వెల్లడించారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి అసత్య ప్రచారాలను చట్టపరంగా ఎదుర్కొంటామని, అందుకే రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వర్సిటీ కేవలం ఎమ్మెల్సీపైనే కాకుండా.. ఈ వివాదాన్ని తప్పుడు కథనాలతో ప్రచారం చేస్తోందంటూ సాక్షి మీడియాతో పాటు గీతం ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన దాదాపు 69 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై మొత్తంగా రూ. 20 కోట్ల సివిల్ మరియు క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. ఈ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయ, విద్యా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








