సామాన్యులను వదిలేసి కుబేరులను పిండండి.. కేంద్రానికి యూఎన్ మాజీ సలహాదారు సలహా!
నిత్యం పెరుగుతున్న ధరలతో బతుకుబండి ఈడ్చలేక సతమతమవుతున్న సామాన్యుడికి, పన్నుల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న వాతలు అన్నీ ఇన్నీ కావు. పెట్రోల్, డీజిల్‌తో పాటు మధ్యతరగతికి ఇష్టమైన బంగారంపై ఎడాపెడా పన్నులు (Taxes) వేయడం తక్షణమే ఆపాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఐక్యరాజ్యసమితి (UN) మాజీ సలహాదారు సంతోష్ మెహ్రోత్రా కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజలను పిండి పిప్పి చేయడం మానేసి, కోట్లకు పడగలెత్తిన అత్యంత సంపన్నులపై పన్నులు పెంచాలని సూచించారు.
పరోక్ష పన్నుల భారం వద్దు..!
ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కువగా పరోక్ష పన్నులపైనే (Indirect Taxes) ఆధారపడుతోందని, దీనివల్ల సామాన్యుల నడ్డి విరుగుతోందని మెహ్రోత్రా ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్ష పన్నుల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి, తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. దానికి బదులుగా.. వేల కోట్లు గడిస్తున్న ధనవంతులపై అదనపు సర్‌చార్జీలు విధిస్తే ప్రభుత్వానికి కావాల్సినంత ఆదాయం వస్తుందని, అదే సమయంలో సాధారణ ప్రజలకు ధరల మంట నుంచి భారీ ఉపశమనం లభిస్తుందని అన్నారు.
ముంచుకొస్తున్న ముప్పు!
మరోవైపు పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) భగ్గుమంటున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారనుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఏకంగా 150 డాలర్లను దాటేస్తుందని బాంబు పేల్చారు. అదే జరిగితే దేశంలో చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), సిరామిక్స్, రత్నాలు-ఆభరణాలు, రెస్టారెంట్ల వంటి కార్మిక ఆధారిత రంగాలు కుదేలవుతాయని స్పష్టం చేశారు. ఆయా పరిశ్రమలు మూతపడితే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి.. మళ్లీ కరోనా కాలం నాటి పరిస్థితుల్లాగా కార్మికులు తిరిగి పల్లెలకు వలస వెళ్లే దారుణ పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
త్వరలో డాలర్‌కు 100 రూపాయలా?
అంతర్జాతీయ పరిణామాల దెబ్బకు భారత కరెన్సీ విలువ దారుణంగా పతనమవుతోందని మెహ్రోత్రా గుర్తుచేశారు. గత కొద్ది నెలలుగా డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న రూపాయి.. ఇదే తీరుగా పతనం కొనసాగితే వచ్చే త్రైమాసికం నాటికి ఏకంగా రూ. 100 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేశారు. రూపాయి బలహీనపడితే మన దిగుమతుల ఖర్చు తడిసి మోపెడై, నిత్యావసరాల ధరలు మరింత ఆకాశాన్ని తాకుతాయన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలంటే.. ప్రభుత్వం వెంటనే పన్ను (Taxes) విధానాల్లో సమతుల్యత తీసుకురావాలని, సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచేలా, ఉపాధి రంగాన్ని కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కేంద్రానికి గట్టిగా సూచించారు.







