కేరళలో నేడే కొలువుదీరనున్న సర్కార్.. మంత్రిగా చెన్నితల
ఎట్టకేలకు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అసంతృప్తులు కూడా కాస్త చల్లబడినట్లే. మరీ ముఖ్యంగా సీనియర్ నేత, సీఎం పదవిలో చివరి వరకూ నిలబడ్డ రమేశ్ చెన్నితల అలకబూనారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని, గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణమంటూ ఓ వార్త వచ్చింది. దీంతో ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడిపోయారని కూడా పుకార్లు వచ్చాయి.
అయితే.. వీడీ సతీశన్ మాత్రం చెన్నితలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ మేరకు 20 మందితో కూడిన మంత్రివర్గ జాబితాను ఆయన గవర్నర్ ఆర్లేకర్ కి సమర్పించారు. అందులో చెన్నితల పేరును కూడా చేర్చారు. దీంతో వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లే.
ఇవి కూడా చదవండి
మొత్తం 20 మందితో మంత్రివర్గం ఏర్పాటు కానుండగా అందులో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్నవారే కావడం గమనార్హం. మంత్రుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు ఎస్సీలు ఉండనున్నారు. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రులను ఎంపిక చేసినట్లు సతీశన్ వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను స్పీకర్‌గా, షనిమోల్ ఉస్మాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని యూడీఎఫ్ నిర్ణయించిందని వివరించారు.
గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఐయూఎంఎల్ సీనియర్ నాయకుడు పి.కె.కున్హలికుట్టి, ఆర్ఎస్పీ నాయకుడు శిబు బాబీ జాన్, కేరళ కాంగ్రెస్ నాయకుడు మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్ (జాకోబ్)కు చెందిన అనూప్ జాకోబ్లకు మళ్లీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ 63 సీట్లలోనే గెలిచినందున చాలా మంది ఆశావహులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నట్లు తెలిపారు. యూడీఎఫ్‌లో కీలక భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌కు 5 మంత్రి పదవులు దక్కాయి. సోమవారం సతీశన్‌తో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి







