భారతదేశ విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సినిమా అయిపోయిందా? లేదా ఇప్పుడే మొదలైందా ?
గత 3-4 వారాలుగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ - సిజేపి ( CJP ) చేసిన ధర్నాలు, హడావిడిగా సీజేపీకి వచ్చే క్రెడిట్ తాము తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party ), కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రధానమంత్రి ఇంటి ముందు చేసిన ఆకస్మిక ధర్నా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్టు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల వారు అటు ఇటు సమానంగా తమ వంతు రాజకీయం చేయటం, చివరికి మోడీ ప్రభుత్వం ఈ ఆందోళనలోని మొదటి డిమాండ్ ఒప్పుకుని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం ఊహించని స్పీడ్ లో జరిగిపోయాయి.
దురదృష్టవశాత్తు ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాల్లో జరగటం మామూలు విషయం అయిపోయింది. ఈ పరీక్షలు ఎలా జరుగుతాయి? లక్ష ల మంది విద్యార్ధిని విద్యార్థులు , వారి కుటుంబాలు ఎలా సిద్ధం అవుతాయి? అదే సమయం లో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కొందరి కోసం- డబ్భు కోసం ఏ విధంగా సిస్టం ని వాడుకొని, పలుకుబడి ని ఉపయోగించి పేపర్ లీక్ చేస్తారు ? అన్న పాయింట్ మీద ఈ మధ్యనే EXAM అనే వెబ్ సిరీస్ కూడా చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఎందుకు ఈ వెబ్ సిరీస్ ప్రస్తావిస్తున్నానంటే ఆ పిల్లలు- వారి కుటుంబాలు పడే బాధ అర్ధం అవుతుంది, పరీక్షా పత్రాల లీక్ అంత కామన్ అయిందన్నమాట దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే . అలాగే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు కూడా ప్రతిపక్షాలకే కాదు బాధితులకూ ఉంటుంది.
ఒకప్పుడు ఒక ఉద్యమం ఎప్పుడు ఎలా ప్రారంభం అవుతుందో చెప్పలేం. మన దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్య కాంత్ యధాలాపంగా నిరుద్యోగులను ఉద్దేశిస్తూ వాడిన మాట – కాక్రోచెస్ ( బొద్దింకలు). అమెరికా లో బోస్టన్ యూనివర్సిటీ లో చదువుకుని , పాలిటిక్స్ మీద ఇంటరెస్ట్ తో ఇండియా వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP ) కమ్యూనికేషన్స్ విభాగం లో పని చేస్తున్న అభిజిత్ దీప్కే ( 29 ఎళ్ల కుర్రాడు) 16 మే 2026 న కాక్రోచ్ జనతా పార్టీ అనే వెబ్సైటు తయారు చేసి సభ్యులను ఆహ్వానించాడు. వెంటనే దేశం లోని Gen Z సభ్యులు గా చేరడం, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సంస్థ ఏర్పడటం జరిగింది. ఈ రోజుకి కూడా ఇది రాజకీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళలేదు. కానీ ఒక 5 పాయింట్స్ తో ఒక మేనిఫెస్టో తయారు చేసి తమ సైట్ లో పెట్టారు. పేరు పెట్టడం దగ్గర నుంచి , మేనిఫెస్టో లో పెట్టిన 5 పాయింట్ లు కూడా బీజేపీ ని ఉద్దేశించి తయారు చేసినవే!

దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నుంచి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రామచంద్రన్ నుంచి ప్రతి భారతీయ వక్త గర్వంగా చెప్పుకునే మాట డిజిటల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ప్రస్తుతం ఇండియాలో 550 మిలియన్ ( అంటే దాదాపుగా 55 కోట్ల మంది ప్రజలు ) యూపీఐ యూజర్స్ ఉన్నారు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 55 కోట్ల మంది సెల్ఫోన్ వాడుతూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. అలాంటి దేశం లో దాదాపు 400 మిలియన్లు ( 40 కోట్ల మంది ) యూత్ అంటే 15 నుంచి 29 ఏళ్ల వ్యక్తులు ఉన్నారు. వీరే ఇప్పుడు అందరూ మాట్లాడుకునే Gen Z . 35 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు మొత్తంగా 80 కోట్లు ఉంటారని ఆంచానా. ఈ Gen Z వలననే కాక్రోచ్ జనతా పార్టీ -CJP ప్రపంచంలోనే అత్యంత వేగంగా దాదాపు 25 మిలియన్ మెంబర్స్ తో తయారైన సంస్థ. ఈ విధమైన గ్రోత్ వస్తుందని ఆ సంస్థను ప్రారంభించిన అభిజిత్ దీప్కే కి కూడా తెలియదేమో.. అనుకోలేదేమో. సీజేపీ కి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 280000 వరకు వెళ్లింది వెంటనే ప్రభుత్వం దాన్ని ఆపేయటం వాళ్ళు కూడా వేరే పేరు తో రావడం , మళ్లీ 250000 ఫాలోయర్స్ వచ్చేయడం జరిగాయి. వీరందరూ కూడా మనం ముచ్చటగా చెప్పుకునే యూత్. ఇందులో వారందరూ పూర్తిస్థాయి నిరుద్యోగులూ కాదు. అయితే వీరందరూ రాజకీయ పార్టీ ఏదైనా కానీ రాజకీయ నాయకులు చేసే పనుల వలన అసంతృప్తి ఉన్నవారు అని అనుకోవచ్చు.
ఈ యూత్ పవర్ అర్ధం చేసుకున్న ప్రధాన మంత్రి నిన్నటి రోజున మాట్లాడుతూ మంత్రులందరూ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లు తెరవాలని, క్రమం తప్పకుండా రీల్స్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఈ సోషల్ మీడియా ఎంత లాభం చేకూరుస్తుందో , అంత కంటే ఎక్కువ చేడు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే గత 10 రోజులలో ఢిల్లీ లో జరిగే ఆందోళన ను సమర్థిస్తూ లేదా వ్యతిరేకిస్తూ అనేక రీల్స్ , AI ద్వారా చేసిన ఇమేజెస్ తో అనేక స్లైడ్స్ వచ్చాయి. అందులో 80% ఫేక్.. నిరాధారమైనవే. ఈ ఆందోళన వలన Gen Z ని ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇంతకు ముందు కంటే ఎక్కువగా శ్రమ పడతాయి. తప్పుడు వార్తలతో, ఫేక్ ఇమేజెస్ తో వచ్చే పోస్ట్ లే ఎక్కువ ఉంటాయి. వచ్చింది వచ్చినట్టు, చూసింది చూసినట్టు ఫార్వర్డ్ చేయకండి. కొంచెం ఆలోచించండి.. అలాగే పేస్ బుక్ లో, ఇంస్టాగ్రామ్ లలో వచ్చిన పోస్టులకు వ్యక్తులు- వారి కుటుంబాలను కలుపుతూ అనవసర – అభ్యంతకరమైన పోస్ట్లు లు పెట్టకండి.
అసలు సినిమా మొదలయ్యేది అంటే ఇదే ! ఆ సినిమా ని ఎంజాయ్ చెయ్యండి. అభాసు పాలవకండి !!
చెన్నూరి వేంకట సుబ్బారావు








