తెలంగాణ ఉద్యమకారులపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్
తెలంగాణ మలిదశ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను, ఉద్యమాన్ని భుజానకెత్తుకున్న అసంఖ్యాక పోరాట యోధులను అధికారికంగా గుర్తించే ప్రక్రియలో రేవంత్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకోసం ఇటీవల ఏర్పాటు చేసిన “తెలంగాణ ఉద్యమకారుల కమిటీ” తన తొలి సమావేశాన్ని ఆదివారం నిర్వహించింది. కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలిపిన నిజమైన ఉద్యమకారులను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా గుర్తించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో కమిటీ ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఉద్యమంలో వారి పాత్ర, వారు ఎదుర్కొన్న ఇబ్బందుల ఆధారంగా కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది.
రెండో కేటగిరీలో ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీఛార్జీలు, కాల్పులు లేదా ఇతర సంఘటనల్లో తీవ్రంగా గాయపడిన వారిని పరిగణిస్తారు. మూడో కేటగిరీలో స్వరాష్ట్ర పోరాటంలో జైలుకు వెళ్లిన వారు, అరెస్ట్ అయిన వారు, వివిధ రకాల ఉద్యమ కేసులను ఎదుర్కొన్న వారిని చేర్చనున్నారు.
ఇవి కూడా చదవండి
నాలుగో కేటగిరీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉధృతంగా పోరాడిన సాధారణ ఉద్యమకారులను గుర్తిస్తారు. వీరి గుర్తింపు కోసం వారు ఉద్యమ కాలంలో పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన వార్తా పత్రికల క్లిప్పింగుల వంటి ఆధారాలను పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది.
గత ప్రభుత్వ హయాంలో కేవలం కొంతమందికే సహాయం అందిందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత కమిటీ రాజకీయాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. కేవలం ప్రభుత్వ రికార్డులకే పరిమితం కాకుండా, విస్తృతమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది.
త్వరలోనే ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పార్టీల నుండి సలహాలు, ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. కేవలం మలిదశ ఉద్యమమే కాకుండా 1969, 1972, 1996 నాటి ఉద్యమకారులతోనూ ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీలతో పాటు వివిధ జిల్లాల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమ సంఘాల నుండి ప్రతిపాదనలు సేకరిస్తారు. పౌరసమాజంలో ఉండి కీలక పాత్ర పోషించిన మేధావులు, విశ్లేషకుల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కమిటీ సభ్యులు స్వయంగా జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ కమిటీ కార్యకలాపాలను అధికారికంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్లో ప్రత్యేకంగా ‘తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో జరగబోయే అఖిలపక్ష సమావేశం ముగిసిన వెంటనే ఈ ఆఫీస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఇవి కూడా చదవండి







