ఏపీలో వాళ్లకు జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు..!
రాష్ట్రంలోని నిరుపేద వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. రాబోయే జూన్ 12వ తేదీ నుండి కొత్తగా వితంతు పింఛన్లను (Widow Pensions) మంజూరు చేయనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ నూతన నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.53 లక్షల మంది అర్హులైన వితంతు మహిళలకు కొత్తగా పింఛన్ లబ్ధి చేకూరనుందని సెర్ప్ (SERP) అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద అర్హులైన ప్రతి వితంతువుకు నెలకు రూ. 4,000 చొప్పున సామాజిక భద్రత పింఛను అందజేస్తారు. ఈ కొత్త పింఛన్ల మంజూరు కారణంగా ఏపీ ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా సుమారు రూ.61 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో భర్త చనిపోయిన వెంటనే పెన్షన్ బదిలీ అయ్యే ‘స్పౌజ్ కేటగిరీ’ (Spouse Category) కింద ఇప్పటికే 2.30 లక్షల మందికి పెన్షన్లు సర్దుబాటు చేయగా, భర్తకు ఎలాంటి పెన్షన్ లేని సాధారణ నిరుపేద వితంతువుల అప్లికేషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే విడతలో జూన్ 12 నుంచి ప్రభుత్వం క్లియర్ చేయనుంది. కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి అవినీతికి తావులేకుండా త్వరలోనే ఆన్లైన్ (Online Registration) ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







