ఏపీలో ఆర్టీసీ చిచ్చు, కొత్త ఉద్యమం రాబోతుందా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీని(Apsrtc) ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న అన్ని రకాల ప్రయత్నాలను తాము తీవ్రంగా అడ్డుకుంటామని ఏపీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) స్పష్టం చేసింది. సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ ముఖ్య నేతలు దామోదరరావు, నరసయ్య ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ, సంస్థ రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.
ఇటీవల కాలంలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల(EV Bus) నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యమే చూసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ రూట్లను మరియు బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం ద్వారా సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా వీటిని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని వారు హితవు పలికారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి మెమోరాండం సమర్పించనున్నట్లు యూనియన్ నేతలు వెల్లడించారు.
ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడతామని చెప్పారు. అలాగే సంస్థలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సుమారు 10,000 ఖాళీ పోస్టులను తక్షణమే గుర్తించి, కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న కార్మికులపై తీవ్రమైన పనిభారం పడుతోందని, ఇది ప్రయాణికుల భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నమ్మకమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్టీసీని కాపాడుకునేందుకు మరియు కార్మికుల హక్కుల రక్షణ కోసం తమ ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తామని దామోదరరావు, నరసయ్య స్పష్టం చేశారు.







