బండి భగీరథ్ పోక్సో కేసు.. తెలంగాణలో మైండ్ గేమ్!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ తిరుగుతున్నాయి. చట్టపరమైన పరిధిని దాటి, ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెను రాజకీయ తుపానును సృష్టించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య ఇదొక హై-వోల్టేజ్ మైండ్ గేమ్‌గా మారగా.. క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ మునుపెన్నడూ లేనంతగా పెరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచే దర్యాప్తులో జాప్యంపై డీజీపీని నేరుగా ప్రశ్నించడం ద్వారా, తమ ప్రభుత్వంలో ఎవరికీ మినహాయింపులు ఉండవనే స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడైనా సరే వదిలేది లేదని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వం తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళల భద్రత, పోక్సో చట్టం తీవ్రతను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం బీజేపీని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టింది. దీనిని తమ పాలనకు ఒక నిదర్శనంగా కాంగ్రెస్ ప్రజల్లో ప్రచారం చేస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, బీజేపీ ఈ కేసును బండి సంజయ్ రాజకీయ ప్రతిష్టపై జరిగిన వ్యవస్థీకృత దాడిగా అభివర్ణిస్తోంది. ఈ కేసు వెనుక లోతైన కుట్ర దాగి ఉందనేది ఆ పార్టీ ప్రధాన వాదన. ప్రధాని మోదీ సభ, హిందూ ఏక్తా యాత్రల సమయంలోనే ఈ కేసును వెలుగులోకి తేవడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. “నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే నా కుమారుడిని టార్గెట్ చేశారు” అని బండి సంజయ్ గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇదొక ‘హనీ ట్రాప్’ అని, బాధితురాలు మైనర్ కాదని, ఆమెకు రెండు వేర్వేరు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు ఉన్నాయని బీజేపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, బాధితురాలు మైనర్‌గా తేలడం, భగీరథ్ పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్లక తప్పకపోవడంతో బీజేపీ డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు దీనిని పార్టీ గౌరవ సమస్యగా తీసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఇరు పార్టీల మైండ్ గేమ్ మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ సరికొత్త రాజకీయ రణరంగాన్ని సిద్ధం చేసింది. కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారీగా కలిసిపోయి బాధితురాలికి అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. “బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగితే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయనను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి.” అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది.
ఈ కేసు కేవలం ఒక వ్యక్తిగత నేరారోపణగా మిగిలిపోలేదు. కాంగ్రెస్‌కు ఇది తమ పారదర్శకతను నిరూపించుకునే ఆయుధమైతే, బీజేపీకి ఇది ఉనికిని, నైతికతను కాపాడుకునే పోరాటంగా మారింది. అటు బీఆర్ఎస్ కోల్పోయిన రాజకీయ భూమిని తిరిగి దక్కించుకోవడానికి ఈ అంశాన్ని వాడుకుంటోంది.
ప్రస్తుతం భగీరథ్ లొంగిపోవడంతో ప్రాథమిక అంకం ముగిసినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకునే కొద్దీ, కోర్టు విచారణలు సాగే కొద్దీ తెలంగాణ రాజకీయం మరిన్ని సంచలన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి







