వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐకి రవిశాస్త్రి కీలక సందేశం..!
ఐపిఎల్ లో సంచలనాలకు వేదిక అవుతున్న.. టీనేజ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ప్రతిభపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ వయసు గురించి వస్తున్న చర్చలను కొట్టిపారేసిన ఆయన, బీసీసీఐ (BCCI) కి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాడు. మైదానంలో ఆటగాడి ప్రతిభ కనిపిస్తున్నప్పుడు వయసు అనేది ఒక చర్చనీయాంశంగా మారకూడదని రవిశాస్త్రి తేల్చి చెప్పారు. ఐసీసీ రివ్యూలో సంజనా గణేశన్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. “ప్రజలు అతడి వయసు 14, 15 లేదా 16 అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నిజాయితీగా చెబితే ఎవరికి కావాలి ఆ వివరాలు..? అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని మాత్రమే చూడండి అని కామెంట్ చేసాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. తనకంటే రెట్టింపు వయసున్న అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బౌలర్లను సైతం ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో కేవలం 11 మ్యాచ్‌ల్లోనే 40 సగటుతో, ఏకంగా 236.56 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ సీజన్లో అత్యధికంగా 40 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.
ఈ అసాధారణ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని వైభవ్‌ను వెంటనే భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేయాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడు. జూన్ నెలలో జరగబోయే ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా అతడిని అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేయాలని సూచించాడు. యువ ప్రతిభను ప్రోత్సహించడానికి టీ20 ఫార్మాట్ సరైన వేదిక అని, ఈ ఫార్మాట్లో ఆడేందుకు ఈ కుర్రాడు వందకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వైభవ్ ఆడుతున్న దూకుడు చూస్తుంటే, అతడు ప్రపంచంలోని ఏ అంతర్జాతీయ జట్టులోనైనా సులభంగా చోటు సంపాదించుకోగలడని కొనియాడారు.
వైభవ్ సూర్యవంశీ ఇదివరకే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అలాగే గతేడాది బీహార్ తరఫున ఆడుతూ అత్యంత పిన్న వయసులోనే లిస్ట్-ఎ (List A) సెంచరీ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో జరగబోయే వన్డే ట్రై-సిరీస్ కోసం ఇండియా-ఎ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఇచ్చిన బలమైన మద్దతు వైభవ్ కెరీర్‌కు మరింత బూస్ట్‌ను ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.







